భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఐపీఎల్‌ను తిరిగి ఆరంబించేందుకు బీసీసీఐ సిద్దమైంది. ఐపీఎల్ మ్యాచ్‌లు మే 17 నుంచి ఆరంభం కానున్నాయి. మే 17న చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, కోల్‌కతా మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకి టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ ఓ విన్నపం చేశారు.
ఐపీఎల్ 2025లోని మిగిలిన మ్యాచ్‌లను చీర్ లీడర్స్, డీజేలు లేకుండానే నిర్వహించాలని బీసీసీఐకి సునీల్ గవాస్కర్ సూచించారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల కుటుంబాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సన్నీ విన్నపంను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రూ.2130 తగ్గిన బంగారం ధర!
ఐపీఎల్ 2025లో 17 మ్యాచ్‌లు మిగిలున్నాయి. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అర్ధంతరంగా ఆగిపోయిన మ్యాచ్ మరలా జరగనుంది. మే 24న ధర్మశాలలో కాకుండా.. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. లీగ్ మ్యాచ్‌లు మే 27న ముగియనుండగా.. ప్లేఆఫ్స్ మే 29న ప్రారంభం కానున్నాయి. ఇక ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. ఢిల్లీ, జైపుర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, లక్నో వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి.