అభం శుభం తెలియని మైనర్ బాలికలు అన్యాయానికి గురవుతున్నారు. తెలిసి తెలియని వయస్సులో కొందరు తప్పుచేస్తే.. మరికొందరు మోసపూరిత మాటలకు బలైపోతున్నారు.. ఆర్దిక ఇబ్బందులు, సమాజం పట్ల అవగాహనా రాహిత్యం, ఆధునిక ప్రపంచం పట్ల మక్కువ, అరచేతిలో ఇంటర్ నెట్ బాలికలను చిన్న వయస్సులోనే మోసపోయేలా.. మరికొందరు తప్పుదారి పట్టేలా చేస్తుంది. మోసమైనా, మోజైనా అంతిమంగా బాలికలే నష్టపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న మైనర్ బాలికల అత్యాచార ఘటనలు సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలో ఎనిమిదిమంది మైనర్ బాలికలపై అత్యాచారాల ఘటనలు వెలుగు చూసాయి. చేదు నిజాలు ఆలస్యంగా బయటకు వస్తున్నాయి. ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వారం రోజుల్లో ఎనిమిది మందికి పైగా మైనర్ బాలికలపై అత్యాచారం జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో చోటుచేసుకున్న ఘటనతో విచారణ చేపట్టిన మహిళా కమీషన్ కు అప్పటి వరకు వెలుగు చూడని విషయాలు బయట పడ్డాయి. విస్తుపోయే సంఘటనలు, విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్లారెడ్డి, ఇందల్వాయి, ధర్పల్లి, యడపల్లి, భోదన్, గాజులపేట, ధర్మపురి హిల్స్ ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో ఈ ఘటనలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తుది. వెలుగు చూసిన ఈఘటనల్లో 8 మంది గర్భం దాల్చినట్లు డాక్టర్లు నిర్దారించడం మరింత ఆందోళన కలిగిస్తుంది. కొన్ని ఘటనలు మైనర్ లకు తెలిసి జరగగా మరికొన్ని ఘటనలు మైనర్ ల ప్రమేయం లేకుండానే జరిగినట్లు విచారణలో తేలింది.
ఇటువంటి ఘటనల చాలా వెలుగులోకి రావడంలేదని అంటున్నారు మహిళా సంఘాలు.. చాలా మందికి తెలిసే అన్యాయం జరిగితే…. మరికొందరికి ఏం తెలియకుండా మోసపోతున్నారని అంటున్నారు. మైనర్ గా ఏం తెలియని వయస్సులో మోసపోవడం చాలా సీరియస్ గా తీసుకోవాలని ఆవయస్సులో మోసపోవడం విచారకరం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మైనర్ లను మభ్యపెట్టి, మాయమాటలు చెప్పి మోసం చేసేవారిపైన చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సొంత మనుషులే మాయమాటలు చెప్పి అత్యాచారాలకు పాల్పడుతున్నారని, కంటిపాపే కాటేస్తుంటే చిన్నారులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మహిళా సంఘాలు.
ఏ వయసు మహిళలనైనా మోసం చేసే వారిని ఉపేక్షించడం లేదని వారిపై ఫిర్యాదు అందిన వేంటనే కేసులు నమోదు చేస్తున్నామని విచారణ కూడా వేగంగా జరుపుతున్నామని నిజామాబాద్ ఏసీపీ తెలిపారు. తమ పరిధిలో నమోదైన కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.. వారందరిపైనా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసామని ఏసీపీ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, విచారణ జరుపుతున్నసమయంలో బాధిత మైనర్ లు చెప్తున్న విషయాలు వింటుంటే బాధ కలిగిస్తుందని ఏసీపీ అన్నారు. ఘటనలు చోటుచేసుకున్న తరువాత మైనర్ లు మానసికంగా కుంగిపోతున్నారని… షీ టీం ద్వారా, సఖీ సెంటర్ లో గైడెన్స్ ఇవ్వడం ద్వారా బాధితుల్లో మానసిక స్టయిర్యం కలిగిస్తున్నామని అంటున్నారు.