Site icon NTV Telugu

Matrimonial fraud: విగ్గురాజా మామూలోడు కాదు.. 50 మందిని మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు

Nithya Pelli Koduku

Nithya Pelli Koduku

Matrimonial fraud: నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న నిత్యపెళ్లికొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్గులు పెట్టుకుని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు వంశీకృష్ణ అనే నిత్య పెళ్లికొడుకు. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేశాడు. ఇప్పటికే పలుమార్లు అరెస్టయి జైలుకు వెళ్లివచ్చిన నిత్యపెళ్లికొడుకు వంశీకృష్ణ.. మ్యాట్రిమోని డాట్‌కామ్‌లో అందమైన ఫొటోలు పెట్టి పెళ్లి ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నారు.

Read Also: Dinga Dinga: ఉగాండాను వణికిస్తున్న ‘‘డింగా డింగా’’.. అసలేంటి ఈ కొత్త వ్యాధి..?

తాజాగా ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటానంటూ వంశీకృష్ణ మోసం చేశాడు. డాక్టర్ తండ్రి నుంచి రూ.40 లక్షల వరకు విగ్గురాజా వంశీకృష్ణ వసూలు చేసినట్లు తెలిసింది.వంశీకృష్ణ మోసాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు డాక్టర్‌ తల్లిదండ్రులు. డబ్బులు అడిగితే మహిళా డాక్టర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి..సోషల్‌మీడియాలో పెడుతానంటూ ఆమె తండ్రిని బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మహిళా డాక్టర్ తండ్రి. దీంతో అతడి ఆగడాలన్నీ వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌కు చెందిన మరో కుటుంబానికి తాను ఐటీ కంపెనీ యజమానిని అని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. గతంలో కూడా ఇలా చాలా మందిని మోసం చేసినట్లు తెలిసింది. నిందితుడు ఎంతో మంది యువతులను ఇలా మాయ చేస్తున్నాడు. విగ్గురాజా ఏం చదివాడో ఎవరికీ తెలియదు గానీ మాయమాటలతో అమాయకులను బురిడీ కొట్టించడంలో మాత్ర పీహెచ్‌డీ చేశాడు. ఈ క్రమంలో సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల చిట్టా వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

Exit mobile version