Dinga Dinga: ఆఫ్రికా దేశం ఉగండాను ఓ వింత వ్యాధి వణికిస్తోంది. ‘‘డింగా డింగా’’ అని పిలిచే ఈ వ్యాధి అక్కడి స్థానికుల్లో కలకలం రేపింది. బుండిబుగ్యో జిల్లాలో దాదాపుగా 300 మంది ప్రజలు ఈ వ్యాధినపడ్డారు. ముఖ్యంగా స్త్రీలు, బాలికలను ఈ వ్యాధి ప్రభావితం చేస్తోంది. జర్వంతో పాటు శరీరం విపరీతంగా వణకడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. శరీర చలనవీలతను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి యాంటిబయాటిక్స్ ఇస్తూ చికిత్స అందిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని జిల్లా ఆరోగ్య అధికారి కియితా క్రిస్టోఫర్ తెలిపారు.
అయితే, బుండిబుగ్యో వెలుపలి ప్రాంతాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు. వ్యాధి గురించి పూర్తి విశ్లేషణ కోసం నమూనాలను పంపారు. 1518లో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ లో ‘‘డ్యాన్సింగ్ ప్లేగ్’’ వ్యాధి వచ్చింది. దీని వల్ల ప్రజలు రోజుల తరబడి అనియంత్రితంగా డ్యాన్స్ చేశారు. కొన్నిసార్లు అలసటతో చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ డింగా డింగా కూడా ఇదే తరహాలో కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే, మరో ఆఫ్రికా దేశం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ) రహస్య వ్యాధిని ఎదుర్కొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. పాంజీ హెల్త్ జోన్‌లో 394 కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. జ్వరం, తలనొప్పి, దగ్గు, ముక్కు కారడం, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫ్లుఎంజా, COVID-19, మలేరియా లేదా మీజిల్స్ వంటి శ్వాసకోశ వ్యాధికారక కారకాలు కారణమా కాదా అని నిర్ధారించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఈ వ్యాధి ఏంటనే విషయం పరీక్షల్లో కూడా తెలియడం లేదు.