New Zealand Women in T20 World Cup 2024 Final: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో న్యూజిలాండ్ అడుగుపెట్టింది. శుక్రవారం షార్జా వేదికగా హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌పై కివీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచకప్‌లో 14 ఏళ్ల విరామం తర్వాత కివీస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ 2009, 2010లలో ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటికే ఫైనల్‌కు దక్షిణాఫ్రికా చేరుకోవడంతో.. ఈసారి మహిళల టీ20 ప్రపంచకప్‌లో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. ఓపెనర్లు జార్జియా ప్లిమర్ (33), సుజీ బేట్స్ (26) రాణించారు. అమేలియా కెర్ (7), సోఫీ డివైన్ (12), మ్యాడీ గ్రీన్ (3) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరలో ఇసాబెల్లా గాజే (20) విలువైన రన్స్ చేసింది. డియాండ్రా డాటిన్ (4/22), అఫీ ఫ్లెచర్ (2/23) కివీస్‌కు కళ్లెం వేశారు.
అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓడింది. ఈడెన్ కార్సన్ (3/29), అమేలియా కెర్ (2/14)ల ధాటికి విండీస్ 14 ఓవర్లకు 65/5తో నిలిచింది. ఆశల్లేని స్థితిలో డాటిన్ (33; 22 బంతుల్లో 3×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో విండీస్ రేసులోకి వచ్చింది. 24 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి రావడంతో విండీస్ గెలుస్తుందనుకున్నారు. ఈ సమయంలో డాటిన్‌ను అమేలియా ఔట్ చేసి మ్యాచ్‌ను కివీస్ వైపు తిప్పింది. విండీస్ బ్యాటర్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది.