Political Heat In Kakinada: ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త ఏడాదికి పొలిటికల్ కలర్ పులుముకుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు విందులు, ఆత్మీయ సమావేశాలతో కేడర్‌లో జోష్ నింపే పనిలో పడ్డారు. ఈ సారి టికెట్ రాని అధికార పార్టీ నేతలు, టికెట్ వస్తుందని ఆశాభావంలో ఉన్న నాయకులు ఈ న్యూ ఇయర్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్ఠానం సీటును నిరాకరించింది. ఈ క్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నియోజకవర్గ కేంద్రం భారీ విందు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు మండలాల నుంచి కేడర్ వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆహ్వానిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన జనసేన అధినేత పవన్‌ను కలిశారు. పార్టీ మార్చే ముందు తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు టాక్ నడుస్తోంది.
Read Also: YSR Pension Kanuka: హామీని సంపూర్ణంగా నెరవేర్చిన సీఎం జగన్.. ఇకపై ప్రతినెలా రూ.3వేలు..
ఇదిలా ఉండగా.. జగ్గంపేట నుంచి వైసీపీ నుంచి ఈ సారి మాజీ మంత్రి తోట నరసింహంకు టికెట్ ఖరారు చేసింది. గతంలో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. గత ఐదేళ్లుగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో పాత కేడర్‌ను పలకరించేందుకు ఈ నూతన సంవత్సర వేడుకలను వేదికగా చేసుకున్నారు. సొంత గ్రామంలో ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. శుభాకాంక్షలు చెప్పడానికి అందరూ రావాలని ఆహ్వానించారు. దాంతో పాటు ఈ నూతన సంవత్సరం రోజున రకరకాల వంటకాలతో విందు భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.
మరో వైపు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా ఇదే తరహాలో ప్రత్యేక ఇన్విటేషన్ ఏర్పాటు చేశారు. ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీతో చర్చలు ముగిశాయని.. పార్టీలో చేరడమే లాంఛనమని చెప్పుకుంటున్నారు. వేల మంది అనుచరుల సమక్షంలో ఆయన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. ఈ విందుకు స్పెషల్ వంటకాలు తయారు చేస్తున్నారని సమాచారం.
ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌కు కూడా వైసీపీ టికెట్ నిరాకరించింది. దానికి తగ్గట్టుగా ఆయన తన బలమేంటో నిరూపించుకోవడానికి శంకవనంలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. న్యూఇయర్ వేడుకలను అందరం ఒకేచోట చేసుకుందామని పిలుస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముందుగా ప్లాన్ చేసినప్పటికీ.. జనవరి 12న ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ సారి టికెట్ రాని నేతలు, వస్తుందని ఆశతో ఉన్న నేతలు కేడర్‌కు దగ్గరయ్యేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నం చేస్తున్నారు. సీటు లేకపోవడంతో ఏదో ఒకటి చేయాలని కొందరు.. రీఎంట్రీ ఇవ్వాలని మరికొందరు న్యూఇయర్‌ను ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు.