విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శన అనంతరం పండితులు సీఎంకు వేదాశీర్వచనాలు చేసి.. తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు సీఎం చంద్రబాబుకు అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు రాగా.. ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దర్శన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ప్రజల దర్శనం చేసుకుని, ఆ తరువాత దుర్గమ్మ దర్శనం చేసుకున్నా. ప్రజల ఆదాయం పెంచుతూ ఆరోగ్యంగా ఆనందంగా అమ్మవారు ఉంచాలని కోరుకున్నా. అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అర్చకులు సీఎం చంద్రబాబును కలిసి ఆశీర్వాదం అందించారు. అనంతరం సీఎంకు స్వామివారి తీర్ద ప్రసాదాలు అందించారు. టీటీడీ డైరీ, క్యాలెండర్ సహా స్వామి వారి ఫోటోను సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈఓ శ్యామలరావు అందించారు.