Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు సోమవారం లోక్సభ ఆమోదం తెలిపింది. సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కొత్త బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. బిహార్ ఓటర్ల సమగ్ర సవరణపై విపక్షాలు ఆందోళన నిర్వహిస్తుండటంతో సభలో బిల్లుపై చర్చకు తావులేకుండా పోయింది. బిల్లు ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే ఎలాంటి చర్చా జరగకుండానే మూజువాణి ఓటుతో సభామోదం పొందింది. బిల్లు పాసైన అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. ఈ బిల్లును రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ముందుకు వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో కొత్త చట్టంగా మారి 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
READ MORE: Anas Al-Sharif: ఉగ్రవాదా.. జర్నలిస్టా.. గాజాలో మరణించింది ఎవరు?
పరిగణనలోకి సెలక్షన్ కమిటీ సిఫార్సులు..
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో లోక్సభలో కేంద్రం ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ప్రవేశపెట్టింది. దానిపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించింది. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని పార్లమెంటు సెలెక్ట్ కమిటీ ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం కొత్త ఆదాయపు పన్ను (నం.2) బిల్లు-2025ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. సెలక్ట్ కమిటీ సిఫార్సులన్నింటినీ దాదాపుగా ఆమోదించినట్లు మంత్రి వెల్లడించారు. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి 66 బడ్జెట్లలో (రెండు మధ్యంతర బడ్జెట్లు కలిపి) ఎన్నో సవరణలు జరిగాయి. సంక్లిష్టంగా తయారన ఈ చట్టాన్ని సమీక్షించి, సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త బిల్లును రూపొందించారు. సవరించిన కొత్త బిల్లు దశాబ్దాల నాటి పన్ను నిర్మాణాన్ని మరింత సులభతరం చేస్తుందని, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, MSMEలు అనవసరమైన వ్యాజ్యాలను నివారించడానికి సహాయపడుతుందని బైజయంత్ పాండా అన్నారు.