Anas Al-Sharif: గాజాపై ఇజ్రాయెల్ బీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిపై జరిపిన దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే మరణించిన వారిలో ఒకరు హమాస్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. కానీ అల్-జజీరా న్యూస్ ఛానెల్ మాత్రం అతడిని జర్నలిస్ట్ అని పిలుస్తోంది. ఇంతకు గాజాలో మృతి చెందిన అనాస్ అల్-షరీఫ్ ఎవరు? చావుకు ముందు ఆయన చివరి సందేశం ఏంటి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Tollywood : రేపు ఫెడరేషన్, ఛాంబర్ భేటీ.. ముగింపు పలుకుతారా..?
అనాస్ అల్-షరీఫ్ ఎవరు?
ఇంతకీ అనాస్ అల్-షరీఫ్ ఎవరూ అంటే.. ఆయన గాజాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, అల్ జజీరా అరబిక్ కోసం ఉత్తర స్ట్రిప్ నుంచి విస్తృతంగా రిపోర్టింగ్ చేశాడు. గాజా నగరంలోని అల్-అక్సా విశ్వవిద్యాలయంలో ఆయన మాస్ కమ్యూనికేషన్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2018 లో ఆయన తన రిపోర్టింగ్ స్కి్ల్స్‌తో అనాస్ పాలస్తీనాలో ఉత్తమ యువ జర్నలిస్ట్ అవార్డును అందుకున్నాడు. 2023 అక్టోబర్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అల్-షరీఫ్ గాజాలో అల్-జజీరా మీడియా సంస్థలో ప్రముఖుడిగా గుర్తింపు పొందారు. 2023 డిసెంబర్‌లో గాజా నగరంలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించినప్పుడు ఆయన తన తండ్రిని కోల్పోయాడు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. “నా ఇంటిని లక్ష్యంగా చేసుకుని, నా తండ్రిని చంపినప్పటికీ, నేను జబాలియా శరణార్థి శిబిరం, ఉత్తర గాజా నుంచి కవర్ చేస్తూనే ఉంటాను” అని పేర్కొ్న్నాడు. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో, హమాస్ – ఇజ్రాయెల్ మధ్య జరిగిన కాల్పుల విరమణ తర్వాత, ఆయన ప్రత్యక్ష ప్రసారంలో తన శరీరానికి రక్షణ కవచాన్ని తొలగించాడు.
తాజాగా గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి ప్రధాన ద్వారం వెలుపల ఏర్పాటు చేసిన జర్నలిస్టుల టెంట్‌పై ఇజ్రాయెల్ దాడి చేశారు. దాడిలో అల్ జజీరా అరబిక్ జర్నలిస్ట్ అనాస్ అల్-షరీఫ్, అతని నలుగురు సహచరులు మొహమ్మద్ ఖారీఖే, ఇబ్రహీం జహీర్, మొహమ్మద్ నౌఫాల్, మోమెన్ అలివా ఉన్నారు.
ఆయన చివరి సందేశం…
జర్నలిస్ట్ అనాస్ అల్-షరీఫ్ మరణానికి ముందు చివరి సందేశాన్ని ఇచ్చారు. “నేను చాలాసార్లు బాధను అనుభవించాను, చాలాసార్లు దుఃఖం, నష్టాన్ని చూశాను, అయినప్పటికీ ఎప్పుడు ఎలాంటి అబద్ధాలు లేకుండా సత్యాన్ని యథాతథంగా చెప్పడానికి వెనుకాడలేదు. మౌనంగా ఉండి, మా హత్యను అంగీకరించినా, మా ఊపిరి పీల్చుకున్నా, మా పిల్లలు, మహిళల అవశేషాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూసినా వారి హృదయాలు కరగలేదు. మా ప్రజలు ఒకటిన్నర సంవత్సరాలకుపైగా ఎదుర్కొంటున్న మారణ హెూమాన్ని ఆపడానికి ఏమీ చేయని వారిపై అల్లాహ్ సాక్ష్యం చెప్పుగాక” అని అన్నారు.
ఉగ్రవాది అంటూ.. ఐడీఎఫ్ పోస్ట్
గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిపై దాడులు జరిగిన తర్వాత ఇజ్రాయెల్ మిలిటరీ దీనిపై ప్రకటన చేసింది. అనాస్ అల్ షరీఫ్ ఓ ఉగ్రవాది అని, అతడు హమాస్ టెర్రరిస్ట్ సెల్‌కు హెడ్‌గా పనిచేసినట్లు ఆరోపించింది. గాజా నుంచి సేకరించిన పత్రాలు, ఉగ్రవాదుల శిక్షణ జాబితా, వేతన రికార్డులను పరిశీలించిన తర్వాత.. అతడు హమాస్ ఉగ్రవాది అని నిర్ధరించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ పౌరులు, ఐడీఎఫ్ బలగాలపై జరిగిన రాకెట్ దాడులకు అతడే కారణమని పేర్కొంది. అల్ జజీరాలో చేరి జర్నలిస్టు ముసుగులో ఇజ్రాయెల్‌పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు తమకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని ఐడీఎఫ్ వారి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఘటనపై అల్ జజీరా స్పందన..
“గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం గురించి కవరేజ్ ప్రారంభించినప్పటి నుంచి తమ సిబ్బందిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని అల్ జబీరా నెట్వర్స్ చెప్పింది. గాజాలోని అత్యంత ధైర్యవంతులైన జర్నలిస్టులలో అనాస్ అల్-షరీఫ్ ఒకరని, అతడిని, మిగితా సహచరులను చంపాలని ఆదేశించడం, గాజా ఆక్రమణకు ముందు వస్తున్న గొంతులను నిశ్శబ్దం చేయడానికి ఒక తీవ్ర ప్రయత్నంగా పేర్కొంది.
ముట్టడి చేసిన ప్రాంతం నుంచి నివేదించేటప్పుడు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రమాదాలకు గాజాలో అల్-షరీఫ్, ఇతర విలేకరుల మరణం మరొక ఉదాహరణగా కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ తెలిపింది. CPJ నివేదికల ప్రకారం.. 2023 అక్టోబర్‌లో గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి 186 మంది జర్నలిస్టులు చంపబడ్డారని పేర్కొంది. మీడియా మానిటరింగ్ గ్రూప్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 200 మందికి పైగా జర్నలిస్టులు చంపబడ్డారని, వారిలో అనేక మంది అల్ జజీరా జర్నలిస్టులు కూడా ఉన్నారని జూలై ప్రారంభంలో తెలిపింది.
READ MORE: Minister Anitha: బాబాయ్‌ను చంపిన వారికి ఓటు వేయాలా..?