Nepal Protest: నేపాల్లో అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఇటీవల 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ‘జనరేషన్ – జెడ్ (Gen Z) విప్లవం’గా పేరుపొందింది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంటు సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 12 ఏళ్ల బాలుడు సహా కనీసం 19 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు .
READ ALSO: Asia Cup 2025: ఆసియా కప్‌కు వేళయరా.. వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా!
వేలాది మంది యువ నిరసనకారులు ఖాట్మండు వీధుల్లోకి వచ్చి, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. ఘర్షణలు తీవ్రం కావడంతో, పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అధికారులు రాజధానిలో కర్ఫ్యూ విధించారు. పరిస్థితిని నియంత్రించడానికి ఖాట్మండులోని నిరసన ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. దేశ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి నివాసంలో అత్యున్నత స్థాయి జాతీయ భద్రతా మండలి సమావేశం జరిగింది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఏక్ నారాయణ్ ఆర్యాల్, ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్, హోంమంత్రి రమేష్ లేఖక్, విదేశాంగ మంత్రి అర్జు రానా డియోబా, రక్షణ మంత్రి మన్బీర్ రాయ్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగెల్ పాల్గొన్నారు.
సమావేశం అనంతరం అధికారిక వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ సాయంత్రం దేశ ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన అత్యవసర మంత్రివర్గ సమావేశంలో హెూం మంత్రి రమేష్ లేఖక్ తన రాజీనామాను ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలికి సమర్పించారని వర్గాలు తెలిపాయి. నిరసనల మధ్య, ప్రభుత్వం ఈ సోషల్ మీడియా యాప్లపై నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి.
సెప్టెంబర్ 4న ప్రభుత్వం ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లను నిషేధించాలని తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ యువత ఉద్యమం మొదలు పెట్టింది. ఈ ప్లాట్ఫారమ్లు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోకపోవడం వల్ల ఈ నిషేధం విధించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, దీనిపై దేశవ్యాప్తంగా యువత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.
READ ALSO: Shocking Murder: ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన మూడో భార్య.. రెండో భార్య ఏం చేసిందంటే!