Neapal is First Team ever to score 300 runs in T20I: క్రికెట్‌లో నేపాల్ పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. ఆసియా గేమ్స్ 2023 గ్రూప్ దశలో భాగంగా బుధవారం మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ఏకంగా 314 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 314 భారీ స్కోరు సాధించింది. 300లకు పైగా స్కోర్ చేసిన మొదటి జట్టుగా అవతరించడమే కాకుండా.. టీ20 చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నేపాల్ రికార్డుల్లో నిలిచింది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ పేరుపై ఉన్న రికార్డు బద్దలైంది.
ఆసియా క్రీడల్లో జరిగే మ్యాచ్‌లకు టీ20 హోదాను కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గతంలో పేర్కొంది. దాంతో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా నేపాల్ నిలిచింది. 2019లో ఐర్లాండ్ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ 278/3 స్కోర్ చేసింది. ఆఫ్ఘన్ రికార్డును నేపాల్ బద్దలు కొట్టింది. టీ20ల్లో హై స్కోర్ మాత్రమే కాదు.. ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డులను కూడా నేపాల్ బ్యాటర్లు బద్దలు కొట్టారు.
Also Read: Asian Games 2023: భారత్ ఖాతాలో మరో రజతం.. 16కు చేరిన మొత్తం పతకాల సంఖ్య!
టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన బ్యాటర్‌గా కుశాల్ మల్లా అవతరించాడు. కుశాల్ 34 బంతుల్లో సెంచరీ చేసాడు. కుశాల్ ఈ మ్యాచ్‌లో 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సులతో 137 రన్స్ బాదాడు. మరోవైపు దీపేంద్ర సింగ్ ఐరీ (52 నాటౌట్; 10 బంతుల్లో 8 సిక్స్‌లు) అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. దీపేంద్ర 9 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ తొలి రోజే ఈ రికార్డుల మోత మోగింది.