Nepal PM Prachanda: రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి నేపాల్, భారతదేశం అధికారులు చర్చలకు కూర్చోవాలని నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ సోమవారం అన్నారు.ప్రచండ మే 31 నుంచి జూన్ 3 వరకు భారతదేశాన్ని సందర్శించారు. డిసెంబర్ 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటి అధికారిక విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. గురువారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో రెండు దేశాలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కొత్త రైల్వే సేవలతో సహా ఆరు ప్రాజెక్టులను ప్రారంభించాయి. ఇరువురు నేతలు కూడా సరిహద్దు వివాదాన్ని స్నేహ స్ఫూర్తితో పరిష్కరించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతినిధుల సభలో తన భారత పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు, పౌరసత్వ సవరణ బిల్లు ప్రామాణీకరణ గురించి చట్టసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రచండ స్పందిస్తూ.. నేపాల్, భారతదేశం ఇరుపక్షాలు కలిసి కూర్చుని చర్చలు జరపాలని, మ్యాప్‌ను తమ ముందు ఉంచుకోవాలని అన్నారు.
Read Also: NCB: పాన్-ఇండియా డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన ఎన్సీబీ.. వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
“నా భారత పర్యటనలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి. దేశ ప్రయోజనాలు, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాలపై మేము ఆందోళన చెందుతున్నాము. సరిహద్దు అంశంపై కూడా చర్చలు జరిగాయి.” అని నేపాల్ ప్రధాన మంత్రి పార్లమెంటులో చెప్పారు. తన పర్యటన సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలోని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు కాషాయ రంగు శాలువా ధరించడం గురించి ప్రచండను అడిగినప్పుడు, “ప్రజల మత విశ్వాసాన్ని కించపరిచే పని ఎవరూ చేయకూడదు” అని ప్రచండ అన్నారు. వేస్టేజ్ మేనేజ్‌మెంట్, అక్కడి ఐటీ అభివృద్ధి గురించి తెలుసుకునేందుకు ఇండోర్ వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆయన ఆస్తికుడా లేక నాస్తికుడా అని కొందరు చట్టసభ సభ్యులు అడిగినప్పుడు “నేను లౌకికవాదాన్ని నమ్ముతాను” అని నేపాల్ ప్రధాని అన్నారు. సోమవారం నాటి సెషన్‌లో, పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, సరిహద్దు భద్రత అంశాలు, పౌరసత్వ బిల్లుతో సహా వివిధ అంశాలపై ప్రచండను పలు ప్రశ్నలు అడిగారు.
Read Also: Swara Bhasker: పెళ్లి అయిన నాలుగు నెలలకే ఆరు నెలల ప్రెగ్నెంట్.. అందుకేనా సీక్రెట్ పెళ్లి
2020లో మూడు భారతీయ భూభాగాలైన లింపియాధుర, కాలాపాని, లిపులేఖ్‌లను నేపాల్ తమ కొత్త రాజకీయ పటంలో ముద్రించిన తర్వాత భారత్, నేపాల్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ ఈ విషయం తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇది “ఏకపక్ష చర్య” అని పేర్కొంది. ఇలా విస్తరించడం ఆమోదయోగ్యం కాదని నేపాల్‌ను హెచ్చరించింది. వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా భారతదేశానికి నేపాల్ ముఖ్యమైనది. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అనే ఐదు భారతీయ రాష్ట్రాలతో నేపాల్ 1850 కి.మీ పైగా సరిహద్దును పంచుకుంటుంది. వస్తువులు, సేవల రవాణా కోసం నేపాల్ భారతదేశంపై ఎక్కువగా ఆధారపడుతుంది. 1950 నాటి భారత్-నేపాల్ శాంతి, స్నేహ ఒప్పందం రెండు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాలకు పునాదిగా నిలిచింది.