Nellore: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే పొత్తులు, ఎత్తులపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి.. అయితే, ఈ రోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి.. కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి.. మహీధర్ రెడ్డిలతో సమావేశం అయ్యారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. రాష్ట్రంలో, జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరులోని పది స్థానాలనూ గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మాధురిగానే.. పది అసెంబ్లీ.. రెండు లోక్ సభ స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు కలిసికట్టుగా పనిచేస్తాం అన్నారు. నేతల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉన్నాయి.. కానీ, అందరూ కూర్చుని మాట్లాడుకుని ఒక తాటిపై ఉంటాం.. వచ్చే వంద రోజుల్లో మరింత చురుగ్గా వ్యవహరిస్తాం.. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తామన్నారు మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.
Read Also: Sam Pitroda : ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందో చెప్పిన కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా
అయితే, నెల్లూరు జిల్లా రాజీకాయాల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేల భేటీ ఆసక్తికరంగా మారింది.. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిలతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విడివిడిగా సమావేశం అయ్యారు. అనిల్ కుమార్ తో పాటు మరో రెండు నియోజకవర్గాల్లో నేతల మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.. ఇక, నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ముగ్గురిని మార్చాలని అధిష్టానానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు.. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో అనిల్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీలో ఎన్నికలపైనే మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది.. మరోవైపు, మూడు రోజుల్లో ఎన్నికల్లో టికెట్ల పై ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చర్చించనున్నారు.