Neeraj Chopra Set To Create History in Olympics: రెజ్లింగ్ ఫైనల్‌లో అడుగుపెట్టి కనీసం రజత పతకం ఖాయం చేసుకున్న వినేశ్ ఫొగాట్‌పై అనూహ్య రీతిలో అనర్హత వేటు పడడంతో పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి నిష్క్రమించింది. పసిడి దిశగా దూసుకెళ్తున్న భారత హాకీ టీమ్.. అనూహ్యంగా సెమీస్‌లో నిష్క్రమించి కాంస్యం పోరాడనుంది. ఈ రెండు దెబ్బలతో భారత అభిమానులు బాధలో ఉన్నారు. ఈ బాధ నుంచి బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఉపశమనాన్ని ఇస్తాడని అందరూ ఆశగా చూస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్.. పారిస్‌లోనూ పసిడి గెలవాలని దేశం మొత్తం కోరుకుంతోంది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ గురువారం రాత్రి 11.55 గంటలకు జరగనుంది.
క్వాలిఫికేషన్‌లో ఒకే ఒక్క త్రోతోనే 89.34 మీటర్ల దూరం ఈటెను విసిరి నీరజ్ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అయితే ఫైనల్లో అతడికి గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రత్యర్థులు ముగ్గురు నీరజ్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (89.94 మీటర్లు) కన్నా మెరుగైన రికార్డును కలిగి ఉన్నారు. అండర్సన్ పీటర్సన్ (93.07 మీ-గ్రెనెడా), జులియెస్ యెగో (92.72 మీ-జర్మనీ), జాకబ్ వాద్లెచ్ (90.88 మీ-చెక్ రిపబ్లిక్)లకు నీరజ్ కంటే మెరుగైన రికార్డు ఉంది. అయితే ఈ ముగ్గురి కంటే క్వాలిఫికేషన్లో మనోడిదే అత్యుత్తమం. ఫైనల్ కాబట్టి అందరూ తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకే చూస్తారు. ఈ రోజు ఉత్తమ ప్రదర్శన చేసిన వారినే స్వర్ణం వరిస్తుంది.
Also Read: Vinesh Phogat Retirement: వినేశ్ ఫొగాట్ షాకింగ్ నిర్ణయం.. నేను ఓడిపోయా అంటూ..!
అన్నీ కలిసొస్తే స్వర్ణం, లేదా ఏదో ఒక పతకం అయినా నీరజ్ చోప్రా గెలుస్తాడని అంచనా. స్వర్ణ పతకం గెలిస్తే.. రెండు ఒలింపిక్ బంగారు పతకాలు గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నీరజ్ చరిత్ర సృష్టిస్తాడు. భారతదేశంలో గొప్ప అథ్లెట్‌గా అతని పేరు చరిత్రలో నిలిచిపోతుంది. వరుసగా రెండుసార్లు జావెలిన్ త్రో పసిడి నెగ్గిన జాన్ జెలెజ్నీ (చెక్ రిపబ్లిక్) లాంటి దిగ్గజాల సరసన కూడా నీరజ్ నిలుస్తాడు.