వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన భారత ప్రభుత్వం.. ఈ ఏడాదిలోనే 100 శాతం వ్యాక్సినేషన్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.. అయితే, ఇంకా ప్రజలను అపోహలు వెంటాడుతూనే ఉన్నాయి.. కొందరు ఫస్ట్ డేసు వేసుకోవడానికే ముందుకు రాకపోగా.. మరోవైపు.. ఫస్ట్ డోస్ తర్వాత రెండో డోసు తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.. ఇటీవలే వ్యాక్సినేషన్ 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. కానీ, ఫస్ట్ డోసు, సెకండ్ డోసులు తీసుకున్న వారి మధ్య అంతరం మాత్రం భారీగా ఉంది.. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సుమారు 11 కోట్ల మంది ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత గడువు ముగిసిపోయినప్పటికీ సెకండ్ డోసు తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, ఈ నేపథ్యంలో కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.. రేపు అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై చర్చించనున్నారు.. ముఖ్యంగా.. పెండింగ్‌లో ఉన్న రెండో డోసు, ఇప్పటివరకు మొదటి డోసు తీసుకోనివారికి టీకాలు అందించడంపై ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే, మొదట్లో టీకాల కొరత వెంటాడినా.. ఆ తర్వాత క్రమంగా ఆ పరిస్థితి పోయింది.. ఇప్పుడు టీకా డోసులు అందుబాటులో ఉన్నప్పటికీ.. రెండో డోసు విషయంలో ప్రజలు ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75 శాతం మంది మొదటి డోసు వేయించుకోగా.. 31 శాతం మంది మాత్రమే రెండో డోసు తీసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.. దీంతో.. సెకండ్ డోస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు సిద్ధ అవుతోంది సర్కార్.