దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల పర్యటనలలో భాగంగా ఈనెల 12న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాలకు రానున్నారు. ఏపీ పర్యటనలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆమె తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు. సీఎం జగన్ నివాసంలో ద్రౌపది ముర్ముకు తేనీటి విందు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఆమె నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు.
Read Also: Telangana Rains: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి మూడ్రోజుల పాటు సెలవులు
అటు అదేరోజు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మ తెలంగాణలో కూడా పర్యటించనున్నారు. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఏదైనా హోటల్ లేదంటే పబ్లిక్ ప్లేసు లేదా గెస్ట్ హౌజ్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావులను ద్రౌపది ముర్ము కలవనున్నారు. కాగా ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇప్పటికే హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి మంతనాలు జరిపిన విషయం తెలిసిందే.