సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై వరాలు జల్లులు కురిపిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వంట గ్యాస్ ధర వంద రూపాయలకు తగ్గించారు. ఇక ఆయా రాష్ట్రాల్లో నారీమణులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తున్నారు.
తాజాగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కూడా మహిళా ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న క్యాజువల్ లీవ్స్‌కు అదనంగా మరో 10 సీఎల్‌ను మంజూరు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో సంవత్సరానికి 25 రోజులు సీఎల్‌లు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ఏడాదికి 25 రోజుల క్యాజువల్ లీవ్ (సీఎల్)ను ప్రవేశపెడుతున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో అదనంగా 10 రోజుల CLను మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో మహిళా కార్మికులకు సంవత్సరానికి మొత్తం 25 రోజులు సెలవులు దొరకనున్నాయి. పని ఒత్తిడిలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
1990లో మహిళలకు 33 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను రిజర్వ్ చేయడం వంటి కార్యక్రమాలతో లింగ-సమగ్ర విధానాల్లో ఒడిశా ప్రభుత్వం ముందంజలో ఉంది. అంతేకాదు మహిళలు ప్రసవ సమయాల్లో 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కూడా లభించనున్నాయి.
సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పత్రాల్లో తల్లి పేరు చేర్చాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకుని పథకాలు ప్రకటిస్తున్నాయి.