టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణలో టిక్కెట్ రేట్లు అధికంగా ఉన్న కారణంగా ఇకపై తెలంగాణలో తాను నిర్మించే సినిమాలను విడుదల చేయనని నట్టికుమార్ ప్రకటించాడు. ఏపీలో మూసివేసిన థియేటర్లను తెరుచుకునేలా చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి నట్టికుమార్ ధన్యవాదాలు తెలిపాడు. జీవో నంబర్ 35ను రద్దు చేయాలంటూ వైజాగ్ ఎగ్జిబిటర్లు ఎవరూ న్యాయస్థానానికి వెళ్లలేదని.. 224 మందికి తెలియకుండా కొంతమంది కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేశారని నట్టికుమార్ ఆరోపించాడు.
Read Also: మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం..
అసలు విషయం తెలుసుకునేందుకు విచారణకు కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నట్లు నట్టికుమార్ తెలిపాడు. ఈ సమస్య వెనుక టాప్-3లో ఉన్న వ్యక్తి ఉన్నాడని.. ఈ విషయం ఏపీ ప్రభుత్వానికి కూడా తెలుసన్నాడు. ఫిలింఛాంబర్ను ఏపీ, తెలంగాణ ఛాంబర్లుగా విభజన చేయాలని డిమాండ్ చేశాడు. ఫిలింఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులకు అన్యాయం జరుగుతోందని నట్టికుమార్ ఆరోపించాడు. థియేటర్ల సమస్య పరిష్కారానికి తాను, ఆర్.నారాయణమూర్తి కలిసి పరిష్కారం కోసం పనిచేశామన్నాడు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వం మాదిరిగా టిక్కెట్ రేట్లు తగ్గించి చిన్న సినిమాలను కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. తెలంగాణలో చిన్న సినిమాల కోసం 5వ షోకు పర్మిషన్ ఇవ్వాలని కోరాడు. తెలంగాణలో టిక్కెట్ రేట్లు అధికంగా ఉన్న కారణంగా చిన్న సినిమాలను విడుదల చేయడం కష్టతరంగా మారిందని.. అందుకే తాను తెలంగాణలో తన సినిమాలను విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు నట్టికుమార్ పేర్కొన్నాడు.