‘విజయవాడ’ పేరులోనే విజయం ఉందని.. చరిత్ర రాయాలన్నా, సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. జీవోలన్ని తెలుగులో వస్తున్నాయంటే అది వెంకయ్య నాయుడుతోనే సాధ్యం అని పేర్కొన్నారు. ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే అన్నారు. వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబుతో తాను పోటీ పడలేకపోతున్నానని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో శోభాయమానంగా విజయవాడ ఉత్సవ్ ప్రారంభమైంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 3 వేల మంది కళాకారులతో అతిపెద్ద కార్నివాల్ నిర్వహిస్తున్నారు. డ్రోన్ షో నిర్వహిస్తున్నారు. పారా మోటరింగ్, హెలిరైడ్ నిర్వహిస్తున్నారు. మైసూర్ ఉత్సవాలకు ధీటుగా విజయవాడ ఉత్సవాలు జరగాలి. లండన్లో వండర్ కార్నివాల్ బాగా చేస్తారు. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎంపీ కేశినేనిచిన్ని కలిసి విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని చెప్పినప్పుడు ఆచర్యపడ్డాను. మెగా డీఎస్సీ సభ నిర్వహిస్తాం’ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకూ ‘విజయవాడ ఉత్సవ్’ జరగనుంది. 286 ఈవెంట్స్‌తో వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివాల్‌ను నిర్వహిస్తున్నారు.
‘విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. విజయవాడ ఉత్సవ్‌తో విజయవాడకు నూతన శోభ. విజయవాడ ఉత్సవ్ ద్వారా విజయవాడ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. మంచి చేసే వారిని ఎప్పుడు గౌరవించాలి. రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్మెంట్ అవసరం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుంది. కుటుంబ వ్యవస్ధ ప్రస్తుతం ఛిన్నాభిన్నం అవుతోంది. వంట విడిపోతే జంట విడిపోద్ది.. వంటను కాపాడుకోండి. భాష పోతే శ్వాస పోయినట్టే.. అందరూ మాతృ భాషను కాపాడుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలని చంద్రబాబును కోరా.. ఇవాళ తెలుగులో ఇచ్చారు సంతోషం. ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వచ్చి విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం సంతోషం. ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు.. అది మంచిది కాదు. విజయవాడ ఉత్సవ్ సక్సెస్ కావాలంటే అందరూ కష్టపడి పనిచేయాలి’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు.