TDP Deeksha: టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజున ఢిల్లీ నుంచి గల్లీ దాకా టీడీపీ నేతలు సత్యమేవ జయతే దీక్ష పేరుతో ఒక్క రోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు. టీడీపీ నేతలు చేపట్టిన సత్యమేవ జయతే దీక్ష ముగిసింది. ఢిల్లీలో నారా లోకేష్ చేపట్టిన సత్యమేవ జయతే దీక్షతో పాటు రాజమండ్రిలో నారా భువనేశ్వరి చేపట్టిన దీక్ష కూడా ముగిసింది. ఢిల్లీలో లోకేష్, టీడీపీ ఎంపీలకు చిన్నారులు నిమ్మరసం ఇవ్వగా.. భువనేశ్వరికి కూడా చిన్నారులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు.
Also Read: Sad News: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని కొట్టిన టీచర్.. చికిత్స పొందుతూ మృతి !
దొంగ కేసు పెట్టి జైలుకు పంపారు: నారా లోకేష్
దీక్ష విరమించిన అనంతరం నారా లోకేష్, భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటూ దొంగ కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపారని నారా లోకేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్‌లో 2.15 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చామని.. 80 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని లోకేష్ చెప్పారు. చంద్రబాబు కృషి వల్ల ఏపీకి పెట్టుబడులు వచ్చాయని, పరిశ్రమలు వచ్చాయని ఆయన తెలిపారు. చంద్రబాబుపై దొంగకేసు బనాయించి 24 రోజులుగా జైల్లో పెట్టారని పేర్కొన్నారు. 45 సంవత్సరాలు రాష్ట్రం కోసం, దేశం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. రాయలసీమ ,ఆంధ్ర, తెలంగాణను అభివృద్ధి చేసింది చంద్రబాబే అని తెలిపారు.
శాంతియుతంగా ప్రజలు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారని.. నేటి సత్యమేవ జయతే దీక్షలో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌కి పిచ్చి పట్టిందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని మరో మూడు కేసులు రెడీ చేశారన్నారు. తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని మంత్రులు అంటున్నారని.. తప్పు చేయని చంద్రబాబును జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడం బాధాకరమన్నారు. ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేస్తామన్నారు నారా లోకేష్. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డివలెప్మెంట్ తన శాఖకు సంబంధం లేని కేసులు అని ఆయన పేర్కొన్నారు. రేపటి కోర్టు నిర్ణయాన్ని బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. విజిల్ వేసినందుకు కేసులు పెడుతున్నారని.. ఢిల్లీలో గంట కొట్టా నన్ను కూడా అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు.
Also Read: Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కాదు 99 శాతం మంది చంద్రబాబు గురించి తెలిసిన వారు అరెస్టు సరికాదు అని అంటున్నారని ఆయన తెలిపారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు.. కేసు అంటూ తనకూ నోటీసులు ఇచ్చారన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. తనకు సంబంధం లేని విషయాలకు తనపై కేసులు పెడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. 8 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసులో సానుకూల ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నామన్నారు. ఏపీలో పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని నారా లోకేష్ వెల్లడించారు.
ఈ దీక్ష ప్రజలు కోసం చేస్తున్నాను: భువనేశ్వరి
చంద్రబాబు తన ఆయుషు కూడా పోసుకుని బతికి ప్రజలకి సేవ చేయాలని నారా భువనేశ్వరి అన్నారు. ఈ దీక్ష ప్రజలు కోసం చేస్తున్నానని ఆమె వెల్లడించారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు జీవితం తప్పలేదన్నారు. తన తండ్రి, భర్త ఎప్పుడూ ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయలేదని ఆమె వెల్లడించారు. తమకు ఆ అలవాటు లేదన్నారు. మేము నలుగురం నాలుగు దిక్కులు అయిపోయామన్నారు నారా భువనేశ్వరి. తమ కుటుంబానికి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదన్నారు. మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసినా తెలుగుదేశం బిడ్డలు పార్టీని ముందుకి తీసుకువెళ్తారని ఆమె పేర్కొన్నారు. మమ్మల్ని ఎలా లోపలికి తోద్దామా అని చూస్తున్నారని భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు ఆలోచన అమరావతి, పోలవరం అంటూ ఆమె తెలిపారు.