టాలీవుడ్ నటుడు నందు హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ నేడు థియేటర్లలోకి విడుదలకానుంది. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గురించి నందు మాట్లాడుతూ, తన 18 ఏళ్ల సినీ కెరీర్లో ఇది ఒక అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విభిన్నమైన స్క్రీన్‌ప్లే, సరికొత్త ఎడిటింగ్ విధానంతో ఈ సినిమా ఉంటుందని, ముఖ్యంగా ‘జెన్-జీ’ ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. సురేష్ బాబు వంటి దిగ్గజ నిర్మాత ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడంతోనే తాను సగం విజయం సాధించినట్లు భావిస్తున్నామని నందు సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాదు..
Also Read : Anaganaga Oka Raju: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది- నవీన్ పొలిశెట్టి
ఈ సినిమా కథాంశం గురించి వివరిస్తూ, ఒక అబ్బాయి జీవితంలోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిల వల్ల అతని జీవితం ఎలా మలుపు తిరిగింది అనే పాయింట్‌తో సినిమా సాగుతుందని నందు తెలిపారు. ప్రథమార్ధం వీడియో గేమ్‌లా కొత్తగా ఉంటే, ద్వితీయార్ధం బలమైన భావోద్వేగాలతో సాగుతుందని ఆయన వివరించారు. అదే సమయంలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకుంటూ, తనకు డబ్బు కంటే గౌరవమే ముఖ్యమని, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సినిమాతో సోలో హీరోగా మంచి ప్రశంసలు దక్కుతాయని, అవి తనకు మరికొన్నేళ్లు పరిశ్రమలో ముందుకు సాగడానికి తోడ్పడతాయి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజంట్ నందు మాటలు వైరల్ అవుతున్నాయి.