Nandamuri Balakrishna: ఇప్పటికే ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలో ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ.. ఈ రోజు నెల్లూరు జిల్లాలో క్యాంపెయిన్ చేశారు.. గుడ్లూరు, కందుకూరులో ఆయన బస్సు యాత్ర సాగింది.. గుడ్లూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై పంచ్‌లు వేశారు.. జగన్ రాక్షస పాలనని దించేందుకు ప్రతి ఒక్కరూ ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇక, “జగనన్న అంటూ జలగలా పీడించారు.. మామయ్య అంటూ మనోభావాలు తగలబెట్టాడు.. నవరత్నాలు అంటే నడుములు కుంగతీశాడు.. దళితులకు అండగా ఉంటానని వారి చావులతో తన ఆకలి తీర్చుకున్నాడు.. నా ఆడపడుచులంటూ వారి ఉసురుపోసుకుంటున్నారు..” అంటూ ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Read Also: Summer Tips : వేసవిలో పుదీనా నీరు తాగడం వల్ల కలిగే లాభాలేన్నో..
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే.. రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమ కాలువ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ.. ఎన్నికల్లో కందుకూరు అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావును, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.. సైకో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని గద్దె దించే వరకు ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించాలి.. కూటమి అభ్యర్థుల విజయం కోసం అలుపుసొలుపు లేకుండా కష్టపడాలని సూచించారు హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ.