నాయకులు మధ్య ఉన్న అంతర్గత విభేదాలను విడిచిపెట్టండని, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే నాయకులను నమ్మకండని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే అని ఆయన అన్నారు. గతంలో తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారు ఇప్పుడు హామీలతో మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నమ్మకండని, గత తొమ్మిదేళ్లకు ముందు ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించిన నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. అప్పుల పాలైన రైతులను ఆదుకున్న ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని, రెండు విడతలలో 35 వేల కోట్లు రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు.
Also Read : TDP Deeksha: దీక్ష విరమించిన టీడీపీ నేతలు.. లోకేష్, భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
కల్లబొల్లి మాటలు చెప్పి గ్యారెంటీలు చెప్పి మాయ మాటలు చెప్పే వాళ్ళని నమ్మకండి 60 ఏళ్ళు పరిపాలించి ఏం చేశారని ఆయన ధ్వజమెత్తారు. గిరిజన యూనివర్సిటీ పేరు చెప్పి మాయ మాటలు మోస పూరిత వాగ్దానాలను ఇచ్చే బిజెపిని నమ్మకండని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వకుండా మోసం చేస్తుంది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. పోయినసారి ఎన్నికలలో లెక్క ఈసారి జరుగుతున్న లెక్క అడుగుతా ప్రతి గ్రామపంచాయతీ ప్రతి బూతు నుండి వివరాలు సేకరిస్తా అన్నారు నామా నాగేశ్వరరావు.
Also Read : Nobel Prize: కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి దారి.. ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఫలాలు అందని కుటుంబం లేదని గుర్తు చేశారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లను పరుగెట్టిస్తూ బీఆర్‌ఎస్ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. మదన్‌లాల్‌ను వైరా బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేస్తూ దేవదూతగా పంపిచారన్నారు. పార్టీ ఆదేశాలను మనం గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. వైరాలో మదన్‌లాల్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకుగా ఇవ్వాలన్నారు.