ఇటీవల ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. నేడు రాజ్యసభ, లోక్ సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేశారు స్పీకర్. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లోక్ సభపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇవాళ కూడా రాజ్యసభ, లోక్ సభలో కూడా నోటీసులు ఇచ్చామన్నారు. మా ఆందోళనకు, విపక్షాలు కలిసి వచ్చాయని ఆయన వెల్లడించారు. అదాని కంపెనీల అవకతవకలతో ఎల్ఐసి, పేద ప్రజలపై పెను భారం పడుతోందని ఆయన మండిపడ్డారు. చర్చ కోరితే కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలపై ముందు కేంద్రమే స్పందించి… చర్చించాలన్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జేపీసీ, సిట్టింగ్ జడ్జ్ తో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని విపక్ష పార్టీలను సమన్వయం చేస్తోందని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద అంశం వేరే ఏది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోతుందంటేనే అదానికి సహకరిస్తున్నారని అర్థం అవుతోందని ఆయన అన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె కేశవరావు మాట్లాడుతూ.. రెండో రోజు కూడా పార్లమెంట్‌లో వాయిదా తీర్మానాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.
Also Read : Family feuds: ఐరన్ రాడ్డుతో నడిరోడ్డుపై భార్యను కొట్టి చంపిన భర్త
ఎవరి మీద మాకు వ్యతిరేకత లేదని, తక్కువ కాలంలో అదాని అత్యంత ధనవంతుడు కావడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన అన్నారు. అదాని కంపెనీల్లో అవకతవకలు జరిగాయని హిండెన్ బర్గ్ నివేదికలో పేర్కొన్నారని, రెగ్యులేటరీలు కూడా ఏమి చేయడం లేదన్నారు. అదాని ఒక్క మనిషి… వ్యవస్థగా మారాడని, రోడ్లు, కోల్, విద్యుత్, ఎయిర్ పోర్టులు, పోర్టులు, మైనింగ్, చివరికి మీడియా రంగంలో కూడా ఎక్కడా చూసిన అదాని కంపెనీలు ఉన్నాయని ఆయన అన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత క్రోని క్యాప్టిలిజం పెరిగిపోయిందని, ఈ శతాబ్దంలో ఇంతకన్న పెద్ద స్కామ్ లేదన్నారు. సుప్రీంకోర్టు జడ్జి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. విపక్ష పార్టీలన్నీ మాతో కలిసి వస్తున్నాయని, అదాని వల్ల దేశ ప్రతిష్ఠ పోతోందని, ఈడీ, సీబీఐ, ఐటి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు పొలిటికల్ టూల్ మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేయడం, ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేయడం మాత్రమే దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Jupiter: చంద్రుల రారాజు గురు గ్రహం.. కొత్తగా 12 చంద్రుల్ని కనుగొన్న శాస్త్రవేత్తలు