తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాజకీయ అనుభవం, నైపుణ్యం బీజేపీకి కీలకంగా మారబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు. జయలలిత హయాంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే ఆమె మరణానంతరం, 2017లో ఆయన అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో సుదీర్ఘంగా పనిచేస్తూ, పార్టీకి మద్దతుగా నిలిచారు.
READ MORE: Tummala Nageswara Rao : పంట నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం
2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిలో భాగంగా తిరునల్వేలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆయన బీజేపీలో తన స్థానం మరింత బలంగా నిరూపించుకున్నారు. అన్నాడీఎంకేతో నాగేంద్రన్‌కు ఉన్న మంచి సంబంధాల కారణంగా, ఈ కూటమి మరింత బలపడుతుందన్న నమ్మకంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఎంపికపై గతంలో అధ్యక్షుడిగా పని చేసిన అన్నామలై కూడా ఆయనకు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. నాగేంద్రన్ తమిళనాడు బీజేపీ 13వ అధ్యక్షుడిగా రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
READ MORE: Trisha: మిమ్మల్ని చూస్తే నాకు భయమేస్తోంది..