ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిణి వనితా రాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ బాధ్యతను తీసుకొన్నారు. ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, లోకం నాగ మాధవి, పంచకర్ల రమేష్ బాబు, పత్సమట్ల ధర్మరాజు, సుందరపు విజయ్ కుమార్, అరవ శ్రీధర్, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణలు సంతకాలు చేశారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సంతకం చేశారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌లకు మార్చి 10 చివరి గడువు. ప్రభుత్వ సెలవు రోజులు మినహాయించి.. మిగిలిన ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ శాసనసభ భవనంలో నామినేషన్‌లను స్వీకరిస్తారు. మార్చి 11న ఉదయం 11 గంటలకు నామినేషన్‌ల పరిశీలన, మార్చి 13న మధ్యాహ్నం 3 గంటల్లోపు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.