Nadendla Manohar: సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది జనసేన పార్టీ.. సుమారు 10.64 లక్షల మంది అర్హులైన పెన్షన్‌దారుల సొమ్మును దారి మళ్లించారని జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు.. జగన్ చేసేదంత గోరంత, చెప్పేదేమో కొండంత.. స్కీంల పేరుతో ఈ ప్రభుత్వం ఎంతో అవినీతికి పాల్పడుతోంది. రూ. 3 వేలకు పెన్షన్ పెంచుతూ ఇటీవలే కేబినెట్ ఆమోదించింది. పెంచిన పెన్షన్‌ను 54.69 లక్షల మందికి వర్తింప చేస్తూ కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. కానీ, 65.33 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి ప్రకటించారని విమర్శించారు. ఈ ఏడాది నవంబరులో 54.69 లక్షల మందికి రూ. 2750 చొప్పున ఇచ్చామని లెక్కలు చెబుతున్నాయి. కానీ, నవంబర్ నెలలో మాసానికి 65.33 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి చెల్లుబోయిన ప్రకటించారని.. ఈ పెన్షన్ లెక్కల్లో తేడాలేంటి? అని నిలదీశారు.
Read Also: Viral Video : పెళ్లిలో పన్నీర్ లేదని పొట్టు పొట్టుకున్న బంధువులు.. వామ్మో ఏందయ్యా ఇది..
ఎన్ని పెన్షన్లకు ఆమోదం తీసుకుంటున్నారు..? ఎంత మంది పెన్షన్ నిధులు స్వాహా చేస్తున్నారు..? అంటూ ప్రశ్నించారు నాదెండ్ల.. కేబినెట్‌లో కూర్చుని పెన్షన్ల గురించి చర్చించిందెంత..?ఆమోదించించిందెంత..? అని ప్రశ్నించారు. 10.64 లక్షల మంది అర్హత కలిగిన వారిని మోసం చేసి, నెలకు రూ. 292 కోట్లు గుటకాయ స్వాహా చేశారని దుయ్యబట్టారు. పేద ప్రజలను లెక్కల గారడీలతో మోసం చేయడం దుర్మార్గం కాదా..? వీటికి సీఎం, ఇతర మంత్రులు ఏం సమాధానం చెబుతారు..? మంత్రి వర్గ సమావేశంలోనే పొంత లేని గణాంకాలను ఎలా చెప్పారు.. సమావేశంలో ఒక అంకెలు, బయటకు వచ్చి మరో అంకెలా..? అంకెల గారడీతో ఇంకెంత దోచుకుంటారు..? బటన్ నొక్కడం ద్వారా ఎవరి ఖాతాల్లోకి ఎంత వెళుతున్నాయో అర్దం కావడంలేదని కీలక అధికారులే చెబుతున్నారు. కేబినెట్ తీర్మానంలోనే ఇంత మతలబులు ఉంటే.. ఎవరిని అడగాలి..? ఈ పెన్షన్ల బాగోతానికి సీఎం బయటకు వచ్చి సమాధానం చెబుతారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేబినెట్‌లో చేసిన తీర్మానాలను కూడా వక్రీకరిస్తూ.. దొంగ లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.