నిన్న జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దళిత బంధు కోసం డబ్బులు తీసుకున్నారని ఆయన ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేసిన ఘటనపై ఆయన స్పందిస్తూ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న అందుకే నాపై ఇలా కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలిదశ ఉద్యమంలోనే పాల్గొన్నానని, 2002 లో కేసిఆర్ చిత్తశుద్ధి, వాక్ చాతుర్యంతో చేరాననన్నారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. నియోజకవర్గం అభివృద్ధి లో భాగంగా ఎవరికైనా బాధ కలిగిస్తే మన్నించండని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీనే దేవాలయం కేసీఆర్ ఒక దేవుడు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా… టికెట్ విషయంలో కుటుంబ సమస్య తీసుకొచ్చి టికెట్ రాకుండా చేశారని, కేసీఆర్ మాట పై గెలిచే సీటు త్యాగం చేశానని ఆయన అన్నారు.
ఇప్పుడు ఎంపీ టికెట్ వస్తుందనే అక్కసుతో నాపై అబాండాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళిత బంధు పై డబ్బులు తీసుకొన్నానని.. దళితబంధు పై ఎలాంటి స్కాంలు జరగవద్దని ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పానన్నారు. 62 లక్షలు తీసుకున్నానని అంటున్నాడు అది శుద్ద అబద్దమని ఆయన పేర్కొన్నారు. ఉద్యమ నేపథ్యంలో వంద ఎకరాలు అమ్మి పార్టీ కోసం ఖర్చు పెట్టానని ఆయన అన్నారు. అది నాకు చాలా సంతృప్తని ఇచ్చిందన్నారు ముత్తిరెడ్డి. ఏ మండలంలో ఫ్రాడ్ జరగలేదు ఒక మద్దూరు మండలంలోని జరిగిందని, నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బద్దిపడగ కృష్ణారెడ్డి దళితుల దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చొరవతీసుకొని దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు ముత్తిరెడ్డి.