NTV Telugu Site icon

Mukkoti Ekadasi: తిరుమలలో ముక్కోటి రద్దీ.. వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

Tirumala

Tirumala

Mukkoti Ekadasi 2023: తిరుమలలో ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. శనివారం వేకువజామున 1.30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తం శ్రీవారి ఆలయానికి ప్రక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు. తొలుత ప్రముఖులకు, అనంతరం సామాన్యులకు దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుగిరులపై ఎటు చూసినా భక్తజనసందోహంలా మారింది. నేటి నుంచి జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. తిరుపతిలోని కౌంటర్ల దగ్గర వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకు వాహన మండపంలో భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. రేపు ఉదయం 4 గంటలకు ద్వాదశి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. తిరుమలకు పెరిగిన వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంది. తిరుమలకు మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు.

Read Also: Mukkoti Ekadasi: నేడు ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వార దర్శనం రహస్యం గురించి తెలుసా?

వైకుంఠ ద్వార దర్శనాన్ని వేకువజామున 1:30 గంటలకు ప్రారంభించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 4,008 వీఐపీ టికెట్లు జారీ చేస్తే.. 3,850 టికెట్లపై భక్తులు దర్శనానికి విచ్చేశారని తెలిపారు. సర్వదర్శనం భక్తలకు 6 గంటల నుంచి దర్శన టోకెన్లు జారీ చేసినా వారికి 5:15 గంటలకే దర్శనాలు ప్రారంభించామన్నారు. టోకెన్ కలిగిన భక్తులకు రెండు గంటల సమయంలోనే స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నామన్నారు. పదిరోజులలో 8 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. 23న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని 22న సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తున్నట్లు టీటీడీ ముందుగానే ప్రకటించింది. అయితే భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా సర్వదర్శనం లైన్‌లో స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు అంతకుముందే తెలిపారు. దీంతో శుక్రవారం కొందరు భక్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ వద్దకు చేరుకోగా సిబ్బంది అనుమతించలేదు. అప్పటికే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూలైన్లు నారాయణగిరి వద్దకు చేరుకున్నాయి. దీంతో దర్శనానికి అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణగిరి నుంచి జేఈవో కార్యాలయం దగ్గరకు వారు చేరుకుని ఆందోళన చేశారు. అప్రమత్తమైన అధికారులు అలిపిరి దగ్గర 23వ తేదీ టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు. కొందరు భక్తులు వసతి గదుల కోసం ఇబ్బందిపడుతున్నారు.

Read Also: Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ.. వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ

ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక సూచన చేస్తోంది.. కేవలం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని సూచిస్తోంది. టికెట్లు లేని వారు కూడా రావొచ్చు.. కానీ ఎలాంటి దర్శనాలు వారికి ఉండవంటున్నారు. అలిపిరి టోల్‌గేట్ దగ్గర భక్తుల దర్శన టికెట్లను విజిలెన్స్ సిబ్బంది పరిశీలించి.. టికెట్లు ఉన్నవారిని కొండపైకి పంపుతున్నట్లు తెలుస్తోంది. వైకుంఠద్వార దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులను అలిపిరి చెక్‌పాయింట్‌, అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో అనుమతించారు. అవి లేని భక్తులను వెనక్కు పంపారు. అలాగే దర్శన సమయానికి 24 గంటల ముందు మాత్రమే ఎంట్రీ అని చెప్పడంతో చాలామంది అలిపిరి నుంచి వెనుదిరిగారు. తిరుమల స్థానికులను కూడా ఆధార్‌ కార్డులు చూశాకే తిరుమలకు పంపారు. తిరుమలలోనూ దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్నవారికే గదులను కేటాయించారు. ఈ 10 రోజుల పాటూ టీటీడీ సిఫార్సు లేఖల్ని కూడా రద్దు చేసింది.. వీఐపీలు స్వయంగా వస్తేనే దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు.

 

Show comments