MS Dhoni: భారత జట్టు మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీలో అనేక సిరీస్‌లు, ట్రోఫీలను గెలుచుకున్నాడు. ఎంఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లే దీనికి నిదర్శనం. ఐపీఎల్ 2023లో అభిమానులు ధోనీ కోసం హంగామా చేశారు. ధోనీకి ఇది చివరి ఐపీఎల్ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది తర్వాత ధోనీ ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పకున్నా 2024 ఐపీఎల్ ఆడతాడా లేదా అనుమానం అభిమానుల్లో నెలకొంది. దీనికి తోడు ఇటీవలే మాహీ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఐపీఎల్ ఆడటం కష్టమే అని భావించారు. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ధోనీ 2024 ఐపీఎల్ ఆడటంలో హింట్ ఇచ్చేసాడు.
Also Read: Cricket World Cup: వరల్డ్ కప్ లో అత్యధిక భారీ విజయాలు గెలిచిన జట్లు…..
ఒక ఈవెంట్‌లో భాగంగాఇంటర్వ్యూలో ధోనీ రిటైర్మెంట్ అవుతున్నారా అని హోస్ట్ అడగగా.. ఎంఎస్ ధోనీ అతనిని ఆపేసి అంతర్జాతీయ క్రికెట్ నుంచి మాత్రమే రిటైర్ అవుతున్నట్లు చెప్పాడు. ఈ సమయంలో ప్రేక్షకులందరూ కూడా బిగ్గరగా నవ్వడం ప్రారంభించారు. ఐపీఎల్ 2024లో కూడా ఆడటానికి సిద్ధంగా ఉన్నానని ధోనీ పెద్ద హింట్ ఇచ్చారు. ఆ ఈవెంట్‌లో ధోనీ చిరునవ్వుతో ప్రేక్షకుల వైపు సంకేతాలు ఇచ్చి ఐపీఎల్ 2024కి నేను రెడీ అని అభిమానులకు చెప్పకనే చెప్పాడు.
ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్‌కే 2023 టైటిల్‌ను గెలుచుకుంది. ఇది ఆయన కెప్టెన్సీ ఐదో టైటిల్ కావడం గమనార్హం. దీని తర్వాత ధోని వచ్చే ఐపీఎల్ సీజన్‌లోపు ఐపీఎల్ నుండి రిటైర్ అవుతాడని నిరంతరం ఊహాగానాలు వచ్చాయి. ధోనీ ఆ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ, 2007లో భారత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, ఆ తర్వాత భారత జట్టును ముందుకు తీసుకెళ్లిన తీరుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఎంఎస్ ధోనీ మోకాలి గాయం శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆయన ఫాస్ట్ గా కోలుకుంటున్నాడని డాక్టర్లు తెలిపారు. దీంతో అభిమానుల కోసం ధోనీ ఐపీఎల్ 2024 ఆడటం దాదాపుగా ఖాయమైంది. మరి ఆ తర్వాత ధోనీ ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. మొత్తానికి అభిమానులకు శుభవార్తచెప్పిన ధోనీ 2024 ఐపీఎల్ లో మరోసారి చెన్నైను విజేతగా నిలుపుతాడో లేదో చూడాలి.