భారత రాజ్యాంగం ప్రకారం మనది లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య దేశం. ఇందులో మొదటిదైన లౌకిక అనే పదానికి విస్తృత అర్థాన్ని ప్రబోధించారు రాజ్యాంగకర్తలు. మతం అనేది వ్యక్తిగతం, ఎవరికి నచ్చిన మతాన్ని వారు అనుసరించొచ్చు, దాన్ని ఆచరించవచ్చు. కానీ ఇతరుల మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వారి మత విశ్వాసాలకు భంగం కలిగించకూడదు. ఇదే రకంగా ప్రభుత్వం కూడా అన్ని మతాలనూ సమ దృష్టితో చూడాలి. అదే సమయంలో మతాన్ని రాజకీయాలతో ముడి పెట్టకూడదు. మతం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ఇది రాజ్యాంగంలోని మౌలిక సూత్రం. ఈ సూత్రాన్ని తూ.చా.తప్పకుండా పాటిస్తున్నారు చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. ఉగాది పర్వదినాన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో కుటుంబ సభ్యలతో కలిసి పూజలు జరపటం ద్వారా తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఆయన… అదే రోజు సాయంత్రం పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఇఫ్తార్ వేడుకల్లోనూ పాల్గొని పరమత సహన సూత్రానికి ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పారు.
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలోని పలు పట్టణాలు, ప్రాంతాలు, గ్రామాల్లో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి .ఆయా వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి, ఉగాది పండుగ విశిష్టతను, ఉగాది పచ్చడిలోని ఆంతర్యాన్ని వివరించారు. జీవితమంటే ఆనందం, విషాదం, బాధ, ప్రేమ, సంతోషాల సమ్మేళమనే విషయాన్ని ఉగాది పచ్చడి చెబుతోందంటూ తెలిపారు. ఇదే సమయంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన భారతదేశంలోని ముస్లింలు జరుపుకునే అతి పెద్ద పండుగ రంజాన్ అనీ, ఈ సందర్భంగా ఆస్వాదించే ఇఫ్తార్ విందులు హిందూ, ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో లౌకికతత్వానికి, మత సామరస్యానికి పెద్ద పీట వేసే కాంగ్రెస్సే… అసలు సిసలు సెక్యులర్ పార్టీ అని చెప్పకనే చెప్పారు. ఆయా వేడుకల్లో కార్యకర్తలు, నాయకులకు ఇదే విషయాన్ని ఆయన ఒకటికి పదిసార్లు చెబుతూ వారిలో అవగాహన, చైతన్యం కల్పిస్తూ వస్తున్నారు.