MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..

Mithun Reddy

Mithun Reddy

MP Mithun Reddy: అమరావతి అభివృద్ధికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, అక్కడ జరిగే అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం తప్ప అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి లేదని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో మంజూరైన మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తైతే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు.

మదనపల్లె టౌన్ బ్యాంక్‌లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించిన మిథున్ రెడ్డి, ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలే సమాచారం అందించారని తెలిపారు. దీంతో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలలు, భూకబ్జాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యపరుస్తామని ఆయన అన్నారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్ప సమాధానం చెప్పడం లేదని విమర్శించారు.

×
×
Ad

డీఎస్సీ పరీక్షల వ్యవహారంపై కూడా మిథున్ రెడ్డి స్పందించారు. మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థిని పక్కన పెట్టడంతోనే లీకేజీ వ్యవహారం బయటపడిందని అన్నారు. పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించాల్సిన పరిస్థితిలో అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మామిడి రైతులు కూటమి ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయారని మిథున్ రెడ్డి ఆరోపించారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. అలాగే ఆక్వా రైతులకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి..