Supreme Court: 2008 నాటి హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ.. ఓ నేరాన్ని రుజువు చేయడానికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు.. ఘటనకు గల కారణాన్ని నిరూపించాల్సిన అవసరం లేదని, ప్రత్యక్ష సాక్షి లేనప్పుడు మాత్రం నేరానికి ప్రేరేపించిన కారణం కీలకంగా మారుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషనర్‌కు, మృతుడికి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని సాక్షులందరూ పేర్కొన్నారని న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read: GST On EV Charging: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే జీఎస్టీ
2008లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తి తన మేనల్లుడిని హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా తన మేనల్లుడిని అతడి స్నేహితుడు దాడి చేసి హత్య చేశాడని, తాను ఘటనాస్థలానికి వెళ్లేసరికి నిందితుడు పారిపోయాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఘటనాస్థలంలో ఆయుధం దొరికింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి స్నేహితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అతడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ద్విసభ్య ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది.
Also Read: Himayatsagar Reservior: పెరిగిన వరద ఉధృతి.. ఆరు గేట్లు ఎత్తివేత
ఈ కేసులో మృతుడి మేనమామ వాంగ్మూలం నమ్మదగినది కాదని, అది నేరారోపణకు ఆధారం కాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. “ఈ కేసులో నేరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని.. సాధారణంగా ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు నేరానికి గల కారణాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేనందున ఘటనకు ప్రేరేపించిన కారణం కీలకంగా మారుతుంది. దాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించాలి. ఇక, మృతుడికి, నిందితుడికి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని సాక్షులు చెప్పారు.” అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.
పోస్టుమార్టం నివేదికలో ఘటన జరిగిన ప్రదేశంలో దొరికిన ఆయుధం కారణంగా అతడు చనిపోలేదని తేలినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుడు ఏ కారణం లేకుండా తన స్నేహితుడిని ఎందుకు చంపుతాడన్నది ప్రాసిక్యూషన్ రుజువు చేయలేదని కోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది.