Monsoon: వచ్చేస్తున్నాయి నైరుతి రుతుపవనాలు.. కేరళ తీరాన్ని తాకాయి.. భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరో రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తాయనే వార్తలు వచ్చాయి.. కానీ, సీన్ రివర్స్ అయ్యింది.. రుతుపవనాల రాక ఏమోగానీ.. ఎండల తీవ్రత మరింత పెరిగింది. మృగశిరకార్తెలోకి అడుగుపెట్టినా.. బయట అడుగుపెట్టాలంటేనే ఆలోచించాల్సిన స్థాయిలో ఎండలు దంచికొడుతున్నాయి.. అయితే, 6 రోజుల క్రితం ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమలోని పుట్టపర్తి, శ్రీహరికోటలకు చేరుకుని అక్కడే తటస్థంగా ఉండిపోయాయి. దీంతో రుతుపవనాల విస్తరణ జరగక వర్షాలు కురవలేదు.. ఉష్ణోగ్రతలు కూడా తగ్గింది లేదు.. కానీ, ఉష్ణోగ్రతలు ఇంతలా అట్టుడికిపోవడానికి వాయవ్య గాలులే కారణమని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి రాజస్థాన్ నుంచి వేడితో కూడిన పొడిగాలులు వీస్తున్నాయని, అవి దిశ మార్చుకుని నైరుతి లేదా దక్షిణ గాలులు వీచే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రుతువపనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు వచ్చేశాయంటూ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది..
Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో హిందూ మతాన్ని స్వీకరించిన ముస్లిం యువకుడు
ఈ నెల 18–21 మధ్య రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. 19వ తేదీ నుంచి రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. క్రమంగా కోస్తాంధ్రలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ చెబుతోంది.. కాగా, ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూనే ఉన్నాయి.. నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. వర్షాలు పడి, వాతావరణం మారాల్సిన సమయంలో.. మరింతగా సెగలు కక్కుతున్నాయి. సాధారణం కంటే 6 నుంచి 10 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. ఈ సమయంలో చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.