వన్డే ప్రపంచకప్-2023లో భారత జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. అ మెగా టోర్నమెంట్ లో భాగంగా నేడు వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో 5 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 18 పరుగుల మాత్రమే ఇచ్చి కీలకమైన 5 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక ఓవర్ మెయిడిన్ కూడా ఉండటం గమనార్హం. ఇక, 5 వికెట్లతో చెలరేగిన షమీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మహ్మద్ షమీ నిలిచాడు. ఇప్పటి వరకు మహ్మద్ షమీ ప్రపంచకప్ టోర్నమెంట్ ల్లో 45 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత బౌలింగ్ దిగ్గజాలు జహీర్ ఖాన్, జవగాల్ శ్రీనాథ్, జస్ప్రీత్ బూమ్రాలను షమీ అధిగమించాడు. వీరిద్దరూ వన్డే వరల్డ్‌కప్‌లో సంయుక్తంగా 44 వికెట్లు తీసుకున్నారు.
Read Also: Jasprit Bumrah: ప్రపంచకప్‌లో మరో రికార్డ్.. తొలి బంతికే ఘనత సాధించిన స్టార్ బౌలర్
ఇక, మరోవైపు వరుసగా ఏడో విజయంతో అధికారికంగా సెమీ ఫైనల్ కు చేరిన మొట్టమొదటి జట్టుగా టీమిండియా నిలిచింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం అందుకుంది. 358 పరుగుల లక్ష్య ఛేదనలో 19.4 ఓవర్లు బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 55 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ లాంటి టాప్ క్లాస్ జట్ల బ్యాటర్లను గడగడలాడించిన భారత బౌలర్లు, శ్రీలంకపై చెలరేగిపోయారు. భారీ లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక బ్యాటర్లను మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ లు పోటా పోటీగా వికెట్లు తీయడంతో లంకేయులు 55 పరుగులకే కుప్పకూలింది.