PM Narendra Modi Portfolios: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఆదివారం (జూన్ 9) సాయంత్రం ప్రమాణం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. మోడీ 3.0 సర్కార్ కొలువుల్లో కీలక పదవులు మళ్లీ బీజేపీ సీనియర్ నేతలనే వరించాయి. ఇక ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు తగిన రీతిలో శాఖలను కేటాయించారు.
కీలకమైన హోం శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, రోడ్డు రవాణా శాఖ, ఆర్థిక శాఖలు.. బీజేపీ నేతల చేతిలోనే ఉన్నాయి. హోం శాఖను తిరిగి అమిత్ షా నిలబెట్టుకున్నారు. రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖను, ఎస్ జైశంకర్ విదేశాంగ శాఖను, నితిన్ గడ్కరి రోడ్డు-రవాణా శాఖను, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖను మరోసారి దక్కించుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో చేసిన ఆరోగ్య శాఖను తిరిగి పొందారు. గత ప్రభుత్వంలో స్మృతి ఇరానీ నిర్వర్తించిన మహిళా-శిశు సంక్షేమాభివృద్ధి శాఖను అన్నపూర్ణా దేవికి కేటాయించారు.
Also Read: Nokia 3210 4G: 25 ఏళ్ల తర్వాత భారత్ మార్కెట్లోకి నోకియా 3210 4జీ.. ధర ఎంతంటే?
ఇక ప్రధాని నరేంద్ర మోడీ చేతిలోనే కీలక శాఖలు ఉన్నాయి. సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖను ప్రధానికి కేటాయించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి ఇన్‌ఛార్జ్‌గా కూడా నియమించబడ్డారు. ఇవి కాకుండా.. ఏ మంత్రికి కేటాయించని కీలక విధానపరమైన అంశాలు, ఇతర అన్ని శాఖలను కూడా ప్రధానని చూసుకుంటారు. మొత్తంగా మోడీ క్యాబినెట్‌లో 30 మంది క్యాబినెట్ హోదా మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 36 సహాయ మంత్రులకు చోటు కల్పించారు.