MLC Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాష, ఆయన ప్రస్తావించిన అంశాలు నీచంగా, బాధకరంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కవిత వివరించగా, గతంలో కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వ భూములను అమ్మి ఆదాయం పొందాలనే ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పటికీ అది విఫలమైంది. భవిష్యత్తులో పరిశ్రమల అభివృద్ధి కోసం TG IIC ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూములను సేకరించారని ఆమె తెలిపారు. ఇప్పుడు ఆ భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని, వాటిని కుదువ పెట్టేందుకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
ATM Hack: తాళం వాడలేదు, పగులకొట్టలేదు.. కానీ 10 లక్షలు దోచేసిన దొంగలు.! ఎలా అంటే?
TG IIC ను ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే గోప్యమైన జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని, ఇది నిపుణుల సూచనలు లేకుండానే తీసుకున్న తాత్కాలిక నిర్ణయం అని కవిత తెలిపారు. ఈ మార్పుతో TG IICలో ఉన్న లక్ష డెబ్భై వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటీకరించేందుకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. ముఖ్యమంత్రి కొందరు పెద్ద కాంట్రాక్టర్లకు ఈ భూములను అప్పగించారని, దాని ద్వారా 20 వేల కోట్ల రూపాయలు ఆయనే స్వంత ఖజానాకు వెళ్లాయని విమర్శలు చేశారు.
తాను పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని కవిత తెలిపారు. ఇటీవల 47 నియోజకవర్గాల్లో పర్యటన చేసిన సందర్భంగా ప్రజల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నానని, వాటినే పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చానని వివరించారు. సామాజిక తెలంగాణ అంశం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ప్రస్తావించానని అన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల నమ్మకం రోజు రోజుకూ పెరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సమయంలో పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని, కొందరు వ్యక్తులు తాను జైలు నుండి వచ్చినప్పటి నుండి ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలల పాటు జైలులో ఉన్నప్పటికీ ఇంకా తనను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం విషయంలో పార్టీ నాయకత్వం స్పందిస్తుందన్న నమ్మకముందని, కానీ అవసరమైతే తానే గట్టిగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.