కారుణ్య నియామకం కింద తెలంగాణా వాసులకు ఉద్దేశించిన ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని నియమించడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన సందర్భంగా ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, దాని ప్రకారం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టాలు కూడా చేసిందన్నారు. అయితే, కొత్త కాంగ్రెస్ హయాంలో, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఎ రామిరెడ్డి కుమారుడు ఎ రఘునాథ్ రెడ్డికి పాత ప్రభుత్వ ఉత్తర్వును ఉపయోగించి కారుణ్య ప్రాతిపదికన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంలో ఉద్యోగం ఇచ్చారు.
Janga Krishnamurthy: మాజీ మంత్రి అనిల్ మాటలు తగ్గించాలి.. ఎమ్మెల్సీ జంగా కీలక వ్యాఖ్యలు
రఘునాథ్‌రెడ్డి పాఠశాల విద్యాభ్యాసం అంతా కర్నూల్‌లోనే జరిగిందని, అతను తెలంగాణ వ్యక్తి కాకపోయినప్పటికీ 2007 జూలై 12న ఇచ్చిన జీవోను కోట్ చేస్తూ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. అప్పటికి రాష్ట్రం కలిసే ఉందని, 2014 తర్వాత మన రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా ఎన్నో నిబంధనలు మారాయని ఆమె చెప్పారు. అలాంటప్పుడు రఘునాథ్‌రెడ్డికి కంపాషనేట్ అపాయింట్‌మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది చాలా దారుణమని, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉద్యోగాల్లో అన్యాయం జరిగితే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ బిడ్డల పొట్ట కొట్టొద్దని కోరారు. ఈ సందర్భంగా అక్రమ నియామకం విషయాన్ని లేఖ రూపంలో మండలి చైర్మెన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ.. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే సమస్యను పరిశీలించి అవసరమైతే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Suresh: మొదటి భార్యతో విడిపోవడానికి కారణం అదే.. ఇక రాశీని పెళ్లాడాక..