పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలంలో కే.కేశవరావు, కడియం శ్రీహరిలు అనేక పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీని వీడడం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని ఆయన అన్నారు. కే. కేశవరావు కూతురు విజయలక్ష్మి కి హైదరాబాద్ నగరం మేయర్ పదవి ఇవ్వడం జరిగిందని, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన కొద్దిరోజుల్లోనే వీళ్ళు పార్టీ మారడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.
ప్రజా సమస్యలను వదిలేసి బీఆర్ఎస్ పార్టీ ని బదనం చేయడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లాలో పంటలు ఎండిపోతుంటే రైతులను ఆదుకోవాల్సింది పోయి నాయకులకు గేట్లు ఎత్తినమని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు ఉన్నారని, బీఆర్ఎస్ నాయకులను ప్రలోభ పెట్టి, భయపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నా మేము భయపడేది లేదన్నారు. కచ్చితంగా ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ ను గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.