MLC Ananta Babu Murder Case Verdict Today: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు నిందితుడిగా ఉన్నారు. అనంత బాబుకు శిక్ష పడనుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకొని, న్యాయపరంగా ముందుకు సాగేందుకు సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును కూటమి ప్రభుత్వం నియమించింది. ఎమ్మెల్సీ అనంత బాబు తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కాకినాడలో హత్య చేసి డోర్ డెలివరీ చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీ అనంత బాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం, ఆనాడు పోలీసులు సమగ్ర విచారణ చేయకపోవడంపై ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేసు పునఃవిచారణ చేపట్టారు. ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు రాజమహేంద్రవరంకు చెందిన ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. 2022 మే 19న కాకినాడలో తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసినట్లు కేసు నమోదు అయింది.
Also Read: Jakkampudi Raja: జక్కంపూడి రాజా దీక్ష భగ్నం.. 50 మంది హౌస్ అరెస్ట్!
పునఃవిచారణ భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో కాకినాడ జిల్లా ఎస్పీ సిట్ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఈ కేసును నీరు గార్చినట్లు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు న్యాయపోరాటం చేస్తున్నారు. సప్లిమెంట్ ఛార్జిషీటు దాఖలు చేయడానికి సిట్ వేసిన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిగింది. హత్య కేసులో సాంకేతిక ఆధారాలు, కాల్‌డేటా, టవర్ లొకేషన్లను గత ప్రభుత్వ హయాంలో పరిగణనలోకి తీసుకోలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. మృతదేహంపై 31 గాయాలు ఉన్నాయని, అనంత బాబు ఒక్కరే ఈ హత్య చేసే పరిస్థితి లేదని, ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారో గుర్తించాలని మృతుడి తల్లి కోరారని న్యాయవాది పేర్కొన్నారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.