Jakkampudi Raja’s House Arrest over Hunger Strike for Paper Mill workers: రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజా ఆమరణ దీక్షను ముందస్తుగా పోలీసులు భగ్నం చేశారు. నేటి నుండి ఏపీ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఆమరణ నిరాహారదీక్షకు జక్కంపూడి సిద్ధమయ్యారు. పేపరు మిల్లు గేటు ఎదురుగా ఉన్న కళ్యాణంలో దీక్ష చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న సమయంలో భారీగా పోలీసులు అక్కడికి వచ్చారు. జక్కంపూడి రాజాను అరెస్టు చేసి ఇంటికి తరలించారు. రాజా ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు.
పేపర్ మిల్లుకు 500 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు చేపట్టకూడదనే నెపంతో జక్కంపూడి రాజాను పోలీసులు తరలించారు. రాజా అనుచరులు 50 మందిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి రాజమండ్రి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. రాజమండ్రిలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమలులో ఉన్నందున పేపర్ మిల్లు సమీపంలో ఎటువంటి ఆందోళనలు చేపట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం జక్కంపూడి రాజా ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
మంగళవారం ఉదయం 9 గంటలకు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నానని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రకటించారు. పేపరు మిల్లు ఎదురుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పాదాల చెంత ఆమరణ దీక్షకు కూర్చుంటానని చెప్పారు. ‘పేపరు మిల్లు కార్మికులకు వేతన ఒప్పందం, ఇతర సౌకర్యాలు కల్పనలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. సమస్య పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ యాజమాన్యంతో జరుగుతున్న చర్చలు సఫలం కావడం లేదు. యాజమాన్యంతో అమీతుమీ తేల్చుకుంటాం’ అని సోమవారం జక్కంపూడి రాజా తెలిపారు.