Secunderabad MLA Sri Ganesh Statement Over Attack: ఆదివారం రాత్రి తనపై జరిగిన దాడి యత్నంపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ స్పందించారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగానే దాడి ప్రయత్నం జరిగిందని, తనకు కొందరిపై అనుమానం ఉందని తెలిపారు. తన నియోజకవర్గంలో తన పార్టీకి చెందిన ఓ నేత టార్గెట్ చేశారని స్పష్టం చేశారు. సదరు నేత రౌడీయిజం చేస్తాడని, గతంలో అతనిపై హత్య కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారే అని, అందులో కొందరిని తాను గుర్తు పడుతా అని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ చెప్పారు. ఈరోజు ఉదయం సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘నాపైన ఉద్దేశ్యపూర్వకంగానే నిన్న రాత్రి దాడి ప్రయత్నం జరిగింది. నాకు కొందరిపై అనుమానం ఉంది. నా నియోజకవర్గంలో మా పార్టీకి చెందిన ఓ నేత నన్ను టార్గెట్ చేశారు. అతను రౌడీయిజం చేస్తాడు, గతంలో అతనిపై హత్య కేసులు ఉన్నాయి. గత శుక్రవారం నార్త్ జోన్ డీసీపీని కలసి ఫిర్యాదు చేశా. నా సన్నిహితులను బయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నిన్న దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారే. అందులో నేను కొందరిని గుర్తుపడుతా. మళ్లీ పోలీసులను కలిసి అన్ని వివరాలు రెండు రోజులో చెప్తా. పోలీసులు కేసు పారదర్శకంగా దర్యాప్తు చేయకపోతే నేనే వారి పేర్లు బయటపెడతా’ అని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ తెలిపారు.
Also Read: Jaganmohan Rao: దొడ్డిదారిన గెలిచిన జగన్మోహన్ రావు.. సీఐడీ విచారణలో వెలుగులోకి సంచలనాలు!
‘మా గన్‌మెన్‌ల గన్స్ లాక్కున్నారా లేదా అని నేను చూడలేదు. నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. సీసీ కెమెరాల ద్వారా కేసు దర్యాప్టు చేస్తున్నారు. నేను రోడ్డుపై కారులో వెళ్తున్నాను. మా కార్ సైరన్ కొట్టిన మాట వాస్తవమే. సైరన్ కొడితే డ్రైవర్ దగ్గరికి రావాలి, డ్రైవర్ పైన అటాక్ జరగాలి. కానీ నన్ను ఎందుకు టార్గెట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మా ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది. మా ప్రభుత్వం ఇలాంటి రౌడీయిజాన్ని చూస్తూ ఊరుకోదు’ అని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ హెచ్చరించారు. మాణికేశ్వర్ నగర్‌లో ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యేపై ఆదివారం రాత్రి దుండగులు దాడికి యత్నించారు.