జడ్చర్ల నియోజకవర్గంలోని ఉరుకొండ మండల కేంద్రం, తిమ్మనపల్లి, రెవల్లే గ్రామాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటిస్తు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మూడు గంటల కరెంటు కావాలా.. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే 24 గంటల కరెంటు కావాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి రోజులే వస్తాయి.. గత ప్రభుత్వాలు కనీసం తాగునీళ్లైన ఇచ్చాయన్నారు. రైతుల గోసను ఎవరైనా పట్టించుకున్నారా.. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. మళ్లీ మన కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడతల వారీగా పెన్షన్లు ఐదు వేలకు పెంచుతాం.. రైతు బంధును ఏడాదికి ఎకరాకో రూ. 16 వేలకు పెంచుతాం.. ప్రతి ఇంటికి ఐదు లక్షల కేసీఆర్ బీమా పథకాన్ని వర్తింపజేస్తాం.. గత తొమ్మిదేళ్ల పాలన చూసారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మీ ముందరే ఉన్నాయి.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. ఎలక్షన్లప్పుడు వచ్చి ఉచిత హామీలు ఇచ్చే టూరిస్టుల మాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దు అంటూ జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
Read Also: Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మహిళ సజీవదహనం
ఇక, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలుపు కోసం ఆయన తనయుడు కృషి చేస్తున్నారు. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండే నాయకుడినే గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. మిడ్జిల్ మండలంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తనయుడు స్వరణ్ రెడ్డి పాల్గొన్నారు. మిడ్జిల్ మండలంలోని రాణిపేట్, కొత్తపల్లి గ్రామల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుసుకున్నారు.. అవ్వ, తాత బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు.. మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి.. పిలిస్తే పలికే నాయకుడు లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే నాయకులను నమ్మొద్దు.. రిస్కు తీసుకుంటే ఇన్నాళ్లు చేసిన అభివృద్ధికి గండి పండుతుందని ప్రజలకు స్వరణ్ రెడ్డి వివరించారు. గతానికి ఇప్పటికీ మన బతుకులు బాగుపడ్డాయా లేదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. మంచి చేస్తే ప్రభుత్వానికి అండగా నిలవాలి.. కారు గుర్తుకు ఓటు వేసి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్వరణ్ రెడ్డి కోరారు.