వైఎస్సార్ జిల్లా చిలమకూరు, ఎర్రగుంట్ల వద్ద ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలలో కాంట్రాక్ట్ పనులు అన్నీ తమకే ఇవ్వాలంటూ ఫ్లైయాష్ లారీలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. పరిశ్రమలోకి సున్నపురాయి తీసుకెళ్లే మార్గంలో ఓ మినీ బస్సును అడ్డంగా పెట్టి లారీలను నిలిపేశారు. ఫ్లైయాష్ రవాణా చేయవద్దంటూ సీఐ లారీల యజమానులకు హుకుం జారీ చేయడంతో.. లారీలు నిలిచిపోయాయి. ఐదు రోజులుగా ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా ఆగిపోవడంతో.. చిలమకూరు ప్లాంట్‌లో సిమెంట్ ఉత్పత్తి ఇప్పటికే పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు ముడిసరకు లేకపోవడంతో ఈరోజు నుంచి ఎర్రగుంట్ల ప్లాంట్‌లో కూడా ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ విషయంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
కొన్ని రోజులుగా అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు జులుం ప్రదర్శిస్తూ.. ప్లాయాష్ సరఫరాను పూర్తిగా అడ్డుకున్నారు. గత ఐదు రోజులుగా సిమెంట్ పరిశ్రమలోకి లారీలు వెళ్లకుండా ఎమ్మెల్యే వర్గీయులు ఎక్కడికక్కడ ఆపేశారు. సిమెంట్ పరిశ్రమలోని అన్ని కాంట్రాక్టు పనులు తమకే కావాలని ఆది వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సిమెంట్ యాజమాన్యం కొన్ని కాంట్రాక్టులు ఎమ్మెల్యే అనుచరులకే ఇచ్చింది. అయినా కూడా అవి సరిపోవని, మొత్తం అన్నీ తమకే ఇవ్వాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అది కుదరదన్నందుకు పరిశ్రమలకు ముడిసరకు రవాణా కానివ్వకుండా లారీలను ఆపేశారు. దీంతో ఇప్పటికే ఓ ప్లాంట్‌లో ఉత్పత్తి ఆగిపోగా.. నేటి నుంచి మరో ప్లాంట్ కూడా ఆగిపోనుంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆది ఈ సిమెంట్ పరిశ్రమలపై ఒత్తిడి చేయడం ఆరంభించారు.