వైసీపీ పార్టీలో ఉండలేకే విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చినందుకు తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ఏ2 విజయసాయి రెడ్డి, ఏ1 జగన్ రెడ్డి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్లు అప్పులు, తప్పులు చేశారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ ఓ డైనోసార్ అని, జగన్ సార్ బేకార్ అని విమర్శించారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానీయవద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.
కడపలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘ఏ2 విజయసాయి రెడ్డి, ఏ1 జగన్ రెడ్డి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి. జగన్ పార్టీ అడుక్కు వెళ్లింది. వైసీపీ పార్టీ ఓ డైనోసార్, వైఎస్ జగన్ సార్ బేకార్. ఆయనను నమ్ముకున్న వాళ్లది అర్ధనాదం. గత నెల పులివెందుల పర్యటనలో డీఎస్పీ మురళి నాయకను జగన్ బెదిరించారు. రెండు, మూడు నెలల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ డీఎస్పీని బెదిరించారు. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇలాంటి పార్టీ ఉండకూడదు, అందరూ బయటికి రావాలి. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి విజయసాయి ఫోన్ చేశారట. వివేకాకు గుండెపోటు అని ఎవరో చెబితేనే తెలిసిందని విజయసాయి చెప్పారు’ అని అన్నారు.
‘ఆనాడు అవినాష్ రెడ్డి కడప ఎస్పీకి ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పాడు. నేను, బీటెక్ రవి నరికి పొడిచి చంపామని ఆరోపణలు చేశారు. జగన్ అప్ప కేమో కనురెప్పకు తగిలితే హత్యాయత్నం. వాళ్ల చిన్నాన్నను హత్య చేస్తే గుండెపోటు. వైసీపీలో ఉండలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. వైఎస్ జగన్ లాంటి నేతలను వదిలించుకోవాలని ప్రజలను నేను కోరుతున్నా. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానీయవద్దు. 2047కు భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేలా చేస్తాం. రాష్ట్రములో 50 వేల కోట్లతో రైల్వేల నిర్మాణం చేపడుతున్నాం. రాష్ట్రానికి కేంద్రం అనేక రకాలుగా సాయం చేస్తోంది. విశాఖకు 11 వేల కోట్లు సాయం, అమరావతికి పూర్తి సాయం వచ్చింది’ అని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు.