టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ కోసం తాము ఓ ప్రణాళికను సిద్ధం చేశామని ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ వెల్లడించాడు. అభిషేక్ ఆట కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, వీలయితే మొదటి బంతికే బుట్టలో వేస్తాం అని చెప్పాడు. సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని మార్ష్ తెలిపాడు. అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్‌మన్. 2025 ఆసియా కప్ 2025లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. టీ20ల్లో అభిషేక్ మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, భారత్ మధ్య మొదటి టీ20 మఠ్ కాన్ బెర్రాలో జరగనుంది. ఈ టీ20 మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో అభిషేక్ శర్మ సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రశంసించాడు. అభిషేక్ తనకు పెద్ద సవాలుగా నిలుస్తాడని అంగీకరించాడు. ‘అభిషేక్ అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాడు. అతను భారత జట్టుకు మంచి పేరు తెస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. టీ20 సిరీస్‌లో అభిషేక్ ఖచ్చితంగా మాకు సవాల్ విసురుతాడు. మేము కూడా మీరు కోరుకునేది అదే. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో మిమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. అప్పుడే మా సత్తా ఏంటో తెలుస్తుంది’ అని మార్ష్ చెప్పాడు.
Also Read: Viral Video: పుట్టకు పూజలు, నాగయ్య ప్రత్యక్షం.. కార్తీక సోమవారం నాడు అద్భుత దృశ్యం!
అభిషేక్ శర్మ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. 23 ఇన్నింగ్స్‌లలో 36.91 సగటుతో 849 పరుగులు చేశాడు. ఇప్పటికే అతడు రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు బాదాడు. ప్రస్తుతం 926 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. ఇక టీ20లలో ఆస్ట్రేలియాపై భారత్ రికార్డు బాగుంది. రెండు జట్ల మధ్య జరిగిన 32 మ్యాచ్‌లలో టీమిండియా 20 గెలిచింది. గత మూడు టీ20 సిరీస్‌లతో సహా 2024 టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆస్ట్రేలియాను ఓడించింది.