West Godavari: పశ్చిమగోదావరి జిల్లా పెరుపాలెం బీచ్‌లో తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలికను కేవలం ఒక గంట వ్యవధిలో గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి మొగల్తూరు పోలీసులు తమ అప్రమత్తతను చాటుకున్నారు. తమ ఫిర్యాదుపై త్వరితగతిన స్పందించి, తమ పాపను తిరిగి అప్పగించిన బీచ్ ఔట్‌పోస్ట్ పోలీసు అధికారులు, సిబ్బందికి బాలిక తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. భీమవరం నుంచి కుటుంబంతో కలిసి పెరుపాలెం బీచ్‌కు విచ్చేసిన ఎనిమిదేళ్ల బాలిక తప్పిపోయిందంటూ, ఆమె తల్లిదండ్రులు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో పెరుపాలెం బీచ్ అవుట్‌పోస్ట్ పోలీసు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన బీచ్ పెట్రోలింగ్ సిబ్బంది, చుట్టుపక్కల ప్రాంతాలైన కొబ్బరి తోటలు, ప్రధాన రహదారి వైపు గాలింపు చర్యలు చేపట్టారు.
READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్
పోలీసులు అత్యంత అప్రమత్తత, పకడ్బందీ గాలింపు చేపట్టారు. ఫలితంగా, తప్పిపోయిన ప్రదేశం నుంచి సుమారు ఒక కిలోమీటరు దూరంలో ప్రధాన రహదారి వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికను గుర్తించారు. అనంతరం, ఆ బాలికను సురక్షితంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అప్రమత్తతతో అంకితభావంతో పనిచేసి బాలికను రక్షించిన మొగల్తూరు పోలీసుల అత్యుత్తమ కృషిని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రత్యేకంగా అభినందించారు. పెరుపాలెం బీచ్‌కు వచ్చే సందర్శకులు, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం బీచ్ అవుట్‌పోస్ట్ సిబ్బందిని లేదా డయల్ 100/112 ను సంప్రదించాలని ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ సందర్శకులకు విజ్ఞప్తి చేసింది.
READ MORE:Tamannaah : తమన్నా పాలరాతి పరువాలు.. చూస్తే అంతే సంగతి