మైనర్ బాలికపై కన్నేస్తే.. ఇక అంతే సంగతులు, ఏళ్ల తరబడి జైలులో జీవితం మగ్గిపోవాల్సిందే. తాజాగా మైనర్ రేప్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పోక్సో చట్టం కింద అరెస్టయిన యువకునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
మైనర్ బాలికలను రక్షించేందుకు ఎన్ని చట్టాలు అమలు చేస్తున్నా.. అక్కడక్కడ మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. చిన్నారులపై దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు. మాయ మాటలు లేదా చాక్లెట్, బిస్కట్ లేదా డబ్బులు ఇస్తామనో.. లేక బెదిరించో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిందితులపై పోక్సో చట్టాలు పెట్టినా.. మిగతా మృగాళ్లకు మాత్రం బుద్ధి రావడం లేదు. ఫలితంగా ఎక్కడో ఓ చోట చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే.. హైదరాబాద్ నాంపల్లి కోర్టు మైనర్ రేప్ కేసులో సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి ఏకంగా 20 ఏళ్లపాటు కఠిన కారాగార శిక్ష విధించింది.
హైదరాబాద్ పాతబస్తీలోని ఛాదర్‌ఘాట్‌లో కారు వాషర్‌గా జనపాల అఖిల్ పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను మోసం చేశాడు. శారీరకంగా మోజు తీర్చుకుని.. తీరా గర్భవతి అయ్యాక వదిలించుకునే ప్రయత్నం చేశాడు. మైనర్ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో జనపాల అఖిల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. ఈ కేసులో నిందితున్ని విచారించిన అనంతరం.. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో 18 మంది సాక్షులను హజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున వాదన బలంగా వినిపించారు. దీంతో పూర్తిగా విచారించిన తర్వాత న్యాయస్థానం.. ఈ కేసులో సంచలన తీర్పు వెలువరించింది. అఖిల్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. అతనికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ. 5వేలు జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ. 8 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Also Read: Shine Tom Chacko: బహిరంగంగా క్షమాపణలు చెప్పిన ‘దసరా’ విలన్.. వివాదానికి ముగింపు!
మైనర్ రేప్ కేసులో దేశవ్యాప్తంగా ఇలాంటి తీర్పు రావడం ఇదే తొలిసారి. మున్ముందు ఎవరైనా పోకిరీలు మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లాలంటే వణికిపోవాల్సిందే. అందుకే యువత ఇలాంటి నేరాలు చేసి.. జైలుకు వెళ్లి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని పోలీసులు చెబుతున్నారు.