విజయవాడలో రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, రవాణా శాఖ మాజీ మంత్రి పేర్ని నానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోషియేషన్ నేతృత్వంలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ కు వినతి పత్రం ఇచ్చింది లారీ యజమానుల సంఘం. రాష్ట్రంలో లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మంత్రి విశ్వరూప్. లారీ యజమానులిచ్చిన వినతి పత్రంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. విభజనతో మిగులు బడ్జెట్ తెలంగాణకు వెళ్తే, లోటు బడ్జెట్ ఏపీకి వచ్చింది. కోవిడ్ మహమ్మారితో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల సీఎం జగన్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఏడాదికి ఒక సారైనా సీఎం వద్ద లారీ యజమానుల సంఘం నేతలతో సమావేశం ఏర్పాటుకు ప్రయత్నిస్తా. సీఎంతో చర్చించి లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. లారీలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రయత్నం చేస్తానన్నారు మంత్రి పినిపె విశ్వరూప్.
లారీ యజమానుల సంఘం మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో అనేక అంశాలు ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్రంలో డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ రేటుకు డీజిల్ కొనుగోలు చేయడం వల్ల లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఇతర రాష్ట్రాల వాహన యజమానులు రాష్ట్రంలో డీజిల్ కొనడం లేదు. రాష్ట్రంలో డీజిల్ రేట్లు ఎక్కువ ఉండటం వల్ల కొనుగోళ్లు తక్కువై రాష్ట్రానికి నష్టం వస్తోంది. డీజిల్ పై టాక్సులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు లేక లారీ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ-ఏపీ మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలి. ఆర్టీఎ అధికారులు ఇష్టమొచ్చినట్లుగా లారీలపై కేసులు రాస్తూ ఇబ్బందులు పెడుతున్నారు.
లారీలపై గ్రీన్ టాక్స్ ను 200 నుంచి 20 వేలకు పెంచడం సహా అధిక జరిమానాలు విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా పెనాల్టీలు తగ్గించాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా 17సార్లు లారీ ఒనర్స్ అసోషియేషన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి సమస్యలు పరిష్కరించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మూడేళ్లుగా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ఇవ్వడంలేదని లారీ యజమానుల సంఘం అభిప్రాయపడింది.
Hyderabad Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు రోడ్లు జలమయం..