Minister Prashanth Reddy: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. గెలిచేందుకు ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం మరింత హీటెక్కింది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతోందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రెండోస్థానం దక్కే అవకాశం ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.చౌటుప్పల్ మండలం డి.నాగారం గ్రామంలో యువజన సభ్యులు నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై ప్రారంభించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసమే అమ్ముడుపోయి ఈ ఉపఎన్నికను తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ పార్టీలో చేరి, కేసీఆర్‌కు అండగా నిలుస్తున్నారన్నారు. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ సర్పంచ్‌లను కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు.